ఫిరాయింపుల అనుభవం: శరద్ పవార్ సూచనను జగన్ ఫాలో అవుతారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సేవ్ డెమోక్రసీ పేరుతో ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను, మాజీ మంత్రులను కలిశారు. ఈ క్రమంలో మాజీ కేంద్రమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా జగన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిసింది. ఫిరాయింపుల వల్ల గతంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను, వాటిని అధిగమించిన తీరును శరద్ పవార్ వివరించినట్లు సమాచారం.
గతంలో గోవా రాష్ట్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా అధికార పార్టీ కొనుగోలు చేసిందని జగన్మోహన్ రెడ్డితో పవార్ చెప్పారు. కానీ, అప్పట్లో తాము రాజీ లేని పోరాటం చేశామని తెలిపారు. ఫిరాయింపులపై తొలుత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లామని వివరించారు.

తాము పార్టీ ఫిరాయించలేదని, కేవలం కండువా మాత్రమే మార్చుకున్నామని ఎమ్మెల్యేలు బుకాయించినా చివరకు వేటు వేయించగలిగామని శరద్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిసింది. వైయస్సార్ కాంగ్రెస్ కూడా ఇదే దారిలో పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డికి పవార్ సూచించారు. తాము అండగా ఉంటామని జగన్‌కు భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 26ను సవరించడం వల్ల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా పవర్ చెప్పారు. తప్పనిసరి అనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది చాలా కష్టమని తెలిపారు.
అసెంబ్లీ స్థానాల పెంపును ఆశ చూపి ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పని కాదని అన్నారు. ఇటీవలే 14మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
మరికొంత మంది పార్టీ మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయలతో తమ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొనుగోలు చేస్తున్నారని వైయస్ జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు జగన్.












Click it and Unblock the Notifications