శ్రీకాళహస్తిలో ఈసీ సోదాలు,గోడౌన్‌లో వైసీపీకి చెందిన సామగ్రి..!
శ్రీకాళహస్తి: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నవేళ ఈసీ ప్రతీ నియోజకవర్గంలో గట్టి నిఘాను ఏర్పాటు చేసింది. ప్రధాన రహదారులతో పాటు పలు జంక్షన్‌లలో కూడా తనిఖీలు నిర్వహిస్తోంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇక్కడ నిఘా మరింత పటిష్టం చేసింది ఎన్నికల సంఘం. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలంలో ఉన్న పాత ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఎన్నికల సంఘం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీకి చెందినవిగా భావిస్తున్న సామగ్రితో పాటు ఇతర వస్తువులు వెలుగులోకి వచ్చాయి.
ఇక సోదాల సందర్భంగా జగన్ బొమ్మతో ఉన్న చేతి గడియారాలు,వైసీపీ గుర్తు రంగులతో ఉన్న గొడుగులు, గ్రైండర్లు, కుక్కర్లు, స్పీకర్లు, సెల్‌ఫోన్ కవర్లు వంటివి ఈసీ అధికారులు కనుగొన్నారు.దీనిపై ప్రతిపక్ష టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వారిని ప్రలోభాలకు గురిచేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ మండిపడింది. మార్చి 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఫిర్యాదు చేయగా.. అధికారులు ఎవరూ పట్టించుకోలేదని చర్యలు కూడా తీసుకోలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు.తాహసీల్దారుకు విషయం తెలిసినప్పటికీ కూడా మరుసటి రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది.

దాదాపు 8 గంటల పాటు టీడీపీ నాయకులు పోరాటం చేస్తే గాని అధికారులు దిగిరాలేదని స్థానిక నాయకులు చెప్పారు. నేరుగా ఈసీ రంగంలోకి దిగి గోడౌన్‌లోని సరుకులను సీజ్ చేసిందని టీడీపీ నేతలు చెప్పారు. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అలసత్వం ప్రదర్శించిన స్థానిక ఎన్నికల అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ పై తగు చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు.
శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్‌లో భారీగా పట్టుబడ్డ వైసీపీకి చెందిన సామగ్రి - ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ#Srikalahasti #TDP #YSRCP #ElectionCommissionOfIndia #AndhraPradesh #ApElections2024 #ApAssemblyElections2024 #AndhraPradeshElections2024 #AndhraPradeshAssemblyElections2024… pic.twitter.com/AukQw4zXes
— oneindiatelugu (@oneindiatelugu) March 27, 2024
మరోవైపు గోడౌన్‌లో వైసీపీకి చెందిన సామగ్రి ఉందని తెలుసుకున్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఆ గోడౌన్ దగ్గరకు వెళ్లాడు. అయితే గోడౌన్ దగ్గరకు ఎందుకని చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనను హెచ్చరించినట్లు సుధీర్ రెడ్డి చెప్పారు.వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందని అందుకే టీడీపీ నాయకులను బెదిరించడమే కాకుండా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని టీడీపీ మండిపడింది. ఇంకా ఇలాంటివి మూడు గోడౌన్లు ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకుడు బొజ్జా సుధీర్ రెడ్డి చెప్పారు. అందులో కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నట్లు తనకు అనుమానంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications