ఏపిఆన్‌లైన్‌కు రూ. 1,91, 527 టోకరా: అరెస్ట్(ఫొటో)
హైదరాబాద్: సైబర్ నేరానికి పాల్పడిన కేసులో ఓ నిందితుడ్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 1,91,527 మోసానికి పాల్పడిన కేసులో నిందితుడు చిన్ని యువసాయి సాగర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రభుత్వానికి చెందిన aponline.gov.inకు అనుసంధానంగా రెండు యూజర్ ఖాతాలను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. దీంతో ఏపిఆన్ లైన్ అధికారులు వారికి రావాల్సిన నగదును నష్టపోయినట్లు భావించారు.
డబ్బు క్రెడిట్ అయినట్లు చూపిస్తూనే.. తక్కువగా ఉండటంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఏపి ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎస్ఎస్ రావు ఏప్రిల్ 11న సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడు వివిధ పేర్లతో ఈ మోసానికి పాల్పడుతున్నట్లు తేల్చారు. హెడ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ గేట్‌వేల ద్వారా నిందితుడు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు.
2012 సెప్టెంబర్ నుంచి ఈ రకమైన మోసానికి పాల్పడుతున్న యువసాయి సాగర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు నెల్లూరు నుంచి తన వివిధ ఖాతాల ద్వారా మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణలో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ ఎస్. జయరాం, ఎస్ఐలు కె. శ్రీనివాస్, ఎం. మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. వీరందరూ సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సైబర్ క్రైం డి. ప్రతాప్ రెడ్డి, అడిషనల్ డిసిపి(క్రైం) జానకీ షర్మిల నేతృత్వంలో విచారణను కొనసాగించారు.












Click it and Unblock the Notifications