వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం.. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. పెళ్లికి సరిగ్గా నెలరోజులు మాత్రమే మిగిలివుంది. నవంబర్ 25వ తేదీన డాక్టర్ సోమల రఘురామారెడ్డితో కలిసి పెళ్లిపీటలు ఎక్కనున్నారు వైఎస్ అంజలిరెడ్డి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు, పెళ్లి పిలుపులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు, పీసీసీ పెద్దలను స్వయంగా ఆహ్వానించారు షర్మిల. వారిని కలిసి వెడ్డింగ్ కార్డ్ అందజేశారు.
తాజాగా అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్ వెలుగులోకి వచ్చింది. వరుడి కుటుంబం ముద్రించిన వివాహ శుభలేఖ ఇది. తమ కుమారుడు రఘురామారెడ్డి- అంజలిరెడ్డి వివాహానికి బంధువులను ఆహ్వానిస్తూ సోమల సుబ్బారెడ్డి, సోమల పద్మారెడ్డి కుటుంబం దీన్ని ముద్రించింది. ఈ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రత్యేకించి.. అందరి దృష్టి కూడా పెళ్లి వేదిక మీదే నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నవంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు బెంగళూరు యలహంకలోని వైఎస్ షర్మిల నివాసంలో ఈ పెళ్లి జరుగనున్నట్లు ముద్రించారు ఈ కార్డులో. దీంతో పెళ్లి ఎక్కడ జరుగుతుందనే వాదనలను గా తెరపడినట్టయింది. వెన్యూ మీదే కొంతకాలంగా రాష్ట్రంలో చర్చ సాగుతున్న నేపథ్యంలో.. యలహంక నివాసం వేదికగా ఈ వివాహం జరుగనున్నట్లు వరుడి తరఫు కుటుంబం అధికారికంగా ప్రకటించినట్టయింది.
నిజానికి..యలహంక నివాసం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదనేది తెలిసిన విషయమే. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే జగన్.. తన భార్య భారతి, కుమార్తెలు హర్ష, వర్షతో కలిసి అక్కడే నివసిస్తూ వచ్చారు. అది జగన్ బంగళాగా ఏపీలో గతంలో ఒక వర్గానికి చెందిన మీడియా అనేక విమర్శలు చేసింది. ప్రత్యేక కథనాలను సైతం వండి వార్చింది. ఇప్పుడదే బంగళా.. వైఎస్ షర్మిలకు చెందినదిగా ఈ వివాహ ఆహ్వాన పత్రికలో పొందుపర్చారు.
ఇక్కడ అంజలిరెడ్ది పెళ్లిని నిర్వహించబోతోండటం పట్ల.. భద్రత కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవలే జగన్ అభ్యంతరం తెలిపారనే ప్రచారం జరిగింది. జగన్.. జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారనే విషయం తెలిసిందే. అలాంటి నాయకుడి ఇంట్లో ఓ పెళ్లిని నిర్వహించడం వల్ల భవిష్యత్తులో భద్రతపరమైన ఇబ్బందులు వస్తాయనే వాదనలు లేకపోలేదు. బయటి వ్యక్తులు రావడం వల్ల ఇంటి సెక్యూరిటీ వ్యవస్థ బహిర్గతమౌతుందనేది జగన్ అభ్యంతరం. దీన్ని షర్మిల పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. యలహంక నివాసాన్నే ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications
