ఆస్పత్రులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేస్తే క్రిమినల్ కేసులు!
శస్త్రచికిత్సల్లో ఒక్కసారి మాత్రమే వాడాల్సిన 'సింగిల్ యూజ్' వైద్య పరికరాలను కొన్ని ఆసుపత్రులు మళ్లీ మళ్లీ వినియోగిస్తున్న విషయం కేంద్ర ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చింది. దీనిపై కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులు, వైద్యులపై తీవ్రంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈ పరికరాలను మళ్ళీ మళ్ళీ వినియోగించటం వలన రోగులకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని, పరికరాల పనితీరు దెబ్బతిని జీవితాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని డైరెక్టరేట్ హెచ్చరించింది. ముఖ్యంగా కార్డియాలజీ విభాగంలో యాంజియోప్లాస్టీ సమయంలో, రీ-ఇంప్లాంట్ చేసిన పేస్‌మేకర్లు అమర్చేటప్పుడు, మూత్రపిండాల శస్త్రచికిత్సల్లో ఈ పద్ధతి జరుగుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. ఒక్కో రోగి నుంచి పూర్తి ధర వసూలు చేస్తూ అదే పరికరాన్ని మళ్లీ వాడటం నేరమేనని స్పష్టం చేశారు.

రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తూ, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పద్ధతులు రోగుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని, దీన్ని అరికట్టడం ప్రతి ఆసుపత్రి బాధ్యత అని నొక్కి చెప్పారు. వైద్య రంగంలో సింగిల్ యూజ్ పరికరాలు అంటే సూదులు, క్యాథెటర్లు, స్టెంట్లు, కొన్ని రకాల ఇంప్లాంట్లు, డిస్పోజబుల్ సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటివి.
ఇవి ఒకసారి వాడిన తర్వాత పారవేయాలని తయారీదారులు, నియంత్రణ సంస్థలు స్పష్టంగా సూచిస్తాయి. అయినా కొన్ని ప్రైవేట్, కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖర్చు తగ్గించుకోవడం కోసం లేదా లాభాలు పెంచుకోవడం కోసం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న సందర్భాలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. దీనివల్ల హెపటైటిస్, హెచ్‌ఐవీ, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది.తెలంగాణలోనూ ప్రైవేట్ ఆసుపత్రుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
రోగులు తమకు ఉపయోగించిన పరికరాలు కొత్తవా, లేక పాతవా అని తెలుసుకునే అవకాశం సాధారణంగా ఉండదు. అందుకే ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులు నైతికంగా, చట్టపరంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ఆదేశాలు అమలు కావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు కఠిన తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. వైద్య పరికరాల నాణ్యత, భద్రతపై కేంద్రం ఇటీవల కాలంలో పెద్దగా దృష్టి సారిస్తోంది.
మెడికల్ డివైస్ రూల్స్ కింద సింగిల్ యూజ్ పరికరాల పునర్వినియోగాన్ని నిషేధించారు. ఉల్లంఘనలు జరిగితే లైసెన్స్ రద్దు, జరిమానాలు, కొన్ని సందర్భాల్లో క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. రోగులు కూడా తమకు ఉపయోగించిన పరికరాల గురించి వైద్యులను అడగాలని, అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఉత్తర్వులు రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమైన నిర్ణయంగా చెప్తున్నారు. తెలంగాణలోని అన్ని ఆసుపత్రులు వెంటనే నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications
