రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు, ముహూర్తం ఖరారు- రూ 6 వేలు జమ..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ నిధుల జమకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కేంద్రం విడుదల చేస్తున్న పీఎం కిసాన్ నిధులతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే అర్హుల జాబితాలను ఖరారు చేసారు. దసరా వేళ రైతులకు నిధులు విడుదల చేస్తారని భావించారు. అయితే, ఇప్పుడు దీపావళి ముందే రైతులకు ఈ నిధులు జమ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. రెండు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ కానున్నాయి.
ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ ద్వారా ఇచ్చే రూ 6 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 14వేలు కలిపి ప్రతీ ఏటా రైతులకు రూ 20 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాగా.. ఈ సారి పీఎం కిసాన్ నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో.. ఏపీ ప్రభుత్వం సైతం అదే రోజున అర్హులైన రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ 4 వేలు జమ చేయనుంది. దీంతో, ఒకే సమయంలో రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ నిధుల విడుదల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా... రెగ్యులర్ గా అమలు చేస్తున్న పథకం కావటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

ప్రభుత్వం తుది కసరత్తు
ఇక, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపుగా 45.5 లక్షల మంది రైతులకు లబ్ది అందుతుందని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. పీఎం కిసాన్ నిధుల జమతో పాటుగానే ఈ నిధుల జమ చేస్తుండటంతో.. అక్టోబర్ 17న ఈ నిధులు విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దీపావళికి ముందే అక్టోబర్ 30వ తేదీన ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా.. భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కౌలు రైతులురైతు భరోసా కేంద్రాలలో సీసీఆర్సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్) తీసుకోవాల్సి ఉంటుంది. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చని స్పష్టం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
