ఎగ్జిట్ పోల్స్ ఎందుకు.. ఇదీ మన లెక్క - తేల్చేసిన జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగించి అమరావతి చేరుకున్నారు. పార్టీ ముఖ్యులు కలిసారు. ఎన్నికల తరువాత జగన్ ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే, అది సాధ్యమా అనే చర్చ జరిగింది. అటు చంద్రబాబు సైతం గెలుపు పైన నమ్మకంతో ఉన్నారు. తనను కలిసిన పార్టీ ముఖ్యులతో జగన్ ఎన్నికల ఫలితాల పై కీలక వ్యాఖ్యలు చేసారు. తన అంచనాలను వెల్లడించారు.
జగన్ మరోసారి
ఎన్నికల పోలింగ్ తరువాత జగన్ తన విజయంతో పాటుగా గెలిచే సీట్ల లెక్కలను వెల్లడించారు. ఐప్యాక్ టీం సమావేశంలో 2019లో సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని చెప్పుకొచ్చారు. దీని పైన పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలింగ్ సరళి చూసిన వారికి జగన్ చెప్పిన సంఖ్య నమ్మటం కష్టంగా మారింది. హోరా హోరీగా జరిగిన పోలింగ్..రెండు శాతం మేర పెరగటంతో టీడీపీ కూటమిలో ఆశలు పెరిగాయి. టీడీపీ ముఖ్య నేతలు తమ గెలుపు గురించి జగన్ చెప్పినంత ధీమాగా గెలుపు గురించి ఓపెన్ గా మాట్లాడలేదు.

జగన్ లెక్క ఇలా
ఇక, ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ వస్తుండటంతో ఈ భేటీలో ఆ అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి జగన్ గతంలో తాను చెప్పిన మాటలనే తిరిగి రిపీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా...జూన్ 4న భారీ మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు. పోలింగ్ శాతం నమోదు..మహిళల మద్దతు...సామాజిక వర్గాల తీర్పు గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తొలి నుంచి నమ్ముకున్న వారంతా పార్టీకి అండగా నిలిచారని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో దేశం మొత్తంఏపీ వైపు చూస్తుందని జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ప్రతిపక్షం గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తన్న అంశం పైన జగన్ ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం.
గెలుపు పై ధీమా
జగన్ విదేశాలకు వెళ్లిన తరువాత ఏపీలో రాజకీయంగా చోటు చేసుకున్న అంశాల పైన చర్చ జరిగింది. అధికారుల మార్ప, పిన్నెల్లి పై కేసు, కౌంటింగ్ పైన వస్తున్న సమాచారం గురించి పార్టీ నేతలు జగన్ కు వివరించారు. అయితే, జగన్ మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తాము గెలవటం ఖాయమని..జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ ముఖ్యనేతలు ధీమాగా చెబుతున్నారు. కానీ, ఇదే సమయంలో టీడీపీ కూటమి మాత్రం నేటి ఎగ్జిట్ పోల్స్..జూన్ 4న ఫలితాల్లోనే తమ గెలుపు ఖాయమని వాదిస్తున్నారు. దీంతో..ఎన్నికల ఫలితంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications