ఏంహెడ్డింగ్ పెట్టావయ్యా, నవ్వుతోనే: ఆంధ్రజ్యోతిపై జగన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రజ్యోతి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిఎన్జీవో ఎన్నికల అంశంపై ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో స్పందించారు. పులివెందులలో వైయస్ జగన్‌కు ఎపిఎన్జీవోలు ఝలక్ ఇచ్చారంటూ వార్త వచ్చింది. దీనిపై జగన్ మాట్లాడారు.
ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ వార్త వచ్చిందని, 'జగన్‌కు ఝలక్... ఏం హెడ్డింగ్ పెట్టావయ్యా! అంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఎపిఎన్జీవో ఎన్నికకు సంబంధించి పులివెందులలో కేవలం నాలుగు ఓట్లు మాత్రమే ఉన్నాయని, అక్కడ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఏ ఎపిఎన్జీవో నాయకుడు పైన ఆ వార్త రాశారో, ఆ దుర్గా ప్రసాద్ ప్రెస్ మీట్ పెట్టి కడిగిపారేశారన్నారు. తాము వైయస్ కుటుంబానికి విధేయులమని, పలానా చేయమని ఆ కుటుంబం తమకు ఎప్పుడు చెప్పలేదని వివరణ ఇచ్చారన్నారు. ఎపిఎన్జీవోల విషయం చిన్నదని, ఉద్యోగస్తులకు సంబంధించిన అంశమన్నారు. వాళ్ల ఎన్నికలు వాళ్లు జరుపుకుంటారని, అందులో రాజకీయాలు చేయాలని తమ పార్టీతో సహా ఏ పార్టీ కోరుకోదన్నారు.
ఎపిఎన్జీవోలకు సంబంధించి కూడా రాజకీయాలు చేయాలనే మనస్థత్వం ఆంధ్రజ్యోతి దినపత్రికది, ఎబిఎన్ ఛానల్‌ది మాత్రమేనని విమర్శించారు. మీరు అడిగినప్పటికీ తాను చిరునవ్వుతోనే సమాధానం చెబుతున్నానని జగన్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications