జగన్‌కు కంటి పరీక్ష- ఆల్ గుడ్: సీమ కోసం భారీ ఆసుపత్రి
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గం పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఇడుపులపాయలో ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తోన్నారు.
ఈ పర్యటనలో భాగంగా పులివెందులలో ఎల్వీ ప్రసాద్- వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జగన్ కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఎలాంటి సమస్యా లేదని డాక్టర్ నిర్ధారించారు.

రాయలసీమ ప్రాంత ప్రజలకు ఇప్పటికే కంటి సంబంధిత వైద్య సేవలను అందిస్తోన్న ఈ ఆసుపత్రిని విస్తరించడానికి అవసరమైన స్థలాన్ని వైఎస్ రాజారెడ్డి ఫౌండేషన్ కేటాయించింది. 10 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చింది. ఈ మొత్తంతో కొత్త భవనాన్ని నిర్మించడంతో పాటు అత్యాధునిక పరికరాలను ఈ ఫౌండేషన్ సమకూర్చింది.
ఆధునికీకరించిన ఈ కంటి ఆసుపత్రికి ఎల్వీ ప్రసాద్- వైఎస్ రాజారెడ్డి ఐ ఇన్‌స్టిట్యూట్‌గా పేరు పెట్టారు. ఫౌండేషన్ తరఫున అత్యాధునిక కంటి వైద్య సేవలను అందించే ఏర్పాట్లను చేశారు వైఎస్ జగన్. రోజుకు 5,000 వరకు కంటి ఆపరేషన్లను నిర్వహించగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో తీసుకొచ్చారు.
హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తరహాలో పులివెందులలో కూడా అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలా 25 వార్డులను ఏర్పాటు చేశారు. కంప్యూటర్‌తో కంటి పరీక్షలు, డయోగ్నస్టిక్ సేవలు అందించనున్నారు.
రాయలసీమ ప్రాంత జిల్లాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా కంటి పరీక్షలతోపాటు ఆపరేషన్లు చేస్తారిక్కడ. మొదటి విడతగా పులివెందులలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారాంతో ఇక్కడ అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దశలవారీగా 50,000 జనాభా గల ప్రతి గ్రామం, పట్టణంలో ఐ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications