YS Jagan : గ్రామాల్లో ఏం చేయాలో అధికారులకు సీఎం జగన్ క్లారిటీ...
ఏపీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.ఇందులో గ్రామాల్లో సమగ్ర భూసర్వేపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా దృష్టి పెట్టాలని, అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని సూచించారు. చేయూత కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అధికారుల్ని ఆదేశించారు. లబ్ధిదారులు తొలివిడత డబ్బు అందుకున్నప్పుడే స్వయం ఉపాధి కార్యక్రమానికి అనుసంధానం చేస్తే ఆ మహిళకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని సీఎం తెలిపారు.
గ్రామీణాభివృద్ధి శాఖ కింద చేపట్టే ఉపాధి కార్యక్రమాలపై నిరంతరం సమీక్ష చేయాలని, ఆ కార్యక్రమాల పనితీరుపై మదింపు చేసేందుకు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. నివేదికల ఆధారంగా ఆ యూనిట్లు విజయవంతంగా నడిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం ఉపాధి కార్యక్రమాల్లో మహిళలకు చేయూతనిచ్చి నడిపిపించడం అన్నది చాలా కీలకమన్నారు. ఆగస్టు 10న మహిళలకు సున్నావడ్డీ కార్యక్రమం నిధులు విడుదల చేస్తామన్నారు.

జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం కింద గ్రామాల్లో సర్వేపైనా సీఎం సమీక్ష చేశారు. 10,943 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్స్ సర్వే పూర్తి అయిందని అధికారులు తెలిపారు. సర్వే పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల్లో భూ హక్కుపత్రాలు ఇస్తున్నామన్నారు.జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం విశిష్టమైనదన్న సీఎం... ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేయర్‌ను నియమించడంవల్ల ఈ ప్రాజెక్టు సజావుగా ముందుకు సాగుతోందన్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవలు కూడా ప్రారంభించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు.
అలాగే జగనన్న కాలనీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. మౌలిక సదుపాయాలు దగ్గరనుంచి ప్రతి అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. జగనన్న కాలనీలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నందున మౌలిక సదుపాయాలు విషయంలో రాజీ పడొద్దన్నారు. అపరిశుభ్రతకు ఈ కాలనీలను నిలయంగా మారకూడదని, అందుకనే కాలనీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టంచేశారు.
ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications