వైసీపీ ఎంపీ అభ్యర్ధులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ? జోరుగా చర్చలు ! జాబితాలో వీరే..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్ధులుగా గెలిచిన వారిలో చాలా కొత్త మొహాలు ఉన్నాయి. అలాగే గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా 2019లో ఎంపీలుగా బరిలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన వైసీపీ గాలిలో వీరంతా అనాయాసంగా విజయాలు అందుకున్నారు. అయితే మరోసారి ఎంపీలుగా పోటీ చేస్తే వీరంతా గెలుస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జాతీయ స్ధాయి సర్వేల్లో వైసీపీ 25కు 25 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని తేలిపోయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన వ్యూహాల్ని మార్చుకుంటున్నారు.
వైసీపీ తరఫున ఎంపీలుగా గెలిచిన వారిలో మెజార్టీ నేతలు తిరిగి బరిలోకి దిగేందుకు ఇష్టపడటం లేదు. అలాగే సీఎం జగన్ సైతం వారిలో ఎక్కువ మందిని తిరిగి ఎంపీలుగా అవకాశం కల్పించేందుకు సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో వారిని ఎమ్మెల్యేలుగా పంపడం లేదా పార్టీ పదవుల్లోకి మార్చడం ద్వారా కొత్త వారికి లేదా ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈసారి ఎంపీలుగా బరిలోకి దింపేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైసీపీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయానికి రాకపోయినా ఎంపీలుగా పోటీ చేసేలా వీరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎంపీ అభ్యర్ధుల రేసులోకి వస్తున్న వారి జాబితాను పరిశీలిస్తే మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రులు కన్నబాబు, ఆళ్ల నాని, అనిల్ కుమార్ యాదవ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ మొహమ్మద్ ఇక్బాల్ తో పాటు ఇంకొందరు ఉన్నారు. వీరిని ఎంపీలుగా పోటీ చేయించేలా జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు, లేదా భవిష్యత్తులో మంత్రులుగా అవకాశం వచ్చే అవకాశం ఉన్న వారు మాత్రం ఎంపీలుగా వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. కానీ పార్టీ గెలుపు సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం తప్పేలా లేదని చెప్తున్నారు. మరోవైపు ఈ కసరత్తు పూర్తయితే కానీ ఎమ్మెల్యే సీట్లపై క్లారిటీ వచ్చే పరిస్దితి లేదు. ఎంపీల ఎంపిక పూర్తయితే ఆ తర్వాత ప్రస్తుత ఎంపీల్ని ఎమ్మెల్యేలుగా పంపే విషయంపై ఆలోచించవచ్చని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంపికల్లో ఐప్యాక్ ఇస్తున్న నివేదికలే కీలకంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications