గడ్కరీతో జగన్ భేటీ-వైజాగ్-భోగాపురం ఎయిర్ పోర్టు రోడ్డు, విజయవాడ బైపాస్ పై వినతులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీలో పలు పెండింగ్ రోడ్డు ప్రాజెక్టుల అంశాన్ని జగన్ గడ్కరీ దృష్టికి తీసుకొచ్చారు. వీరిద్దరూ దాదాపు గంటసేపు సమావేశమయ్యారు.
ఈ ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసిన వైఎస్ జగన్.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక రోడ్డు ప్రాజెక్టుల్ని ఆయన దృష్టికి తెచ్చారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ నిర్మిస్తున్న జాతీయ రహదారి డీపీఆర్ తయారీ అంశంపై వీరిద్దరూ చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం జగన్ గడ్కరీకి తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్‌కారిడర్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటకరంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందని కేంద్రమంత్రికి వివరించారు.

అలాగే విశాఖ నగరంలో వాహనరద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి సహకరించాలని సీఎం జగన్ గడ్కరీని కోరారు. మరోవైపు విజవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని కూడా జగన్ ఆయన్ను కోరారు. ఇందుకోసం సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని సీఎం జగన్ ప్రతిపాదించారు. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు కూడా ఇస్తామని జగన్ గడ్కరీకి తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు చేపట్టాలని గడ్కరీకి విజ్ఞప్తిచేశారు.












Click it and Unblock the Notifications