పీకే సూచన, ఎన్నికలకు ముందు జగన్ సరికొత్త వ్యూహం: 'అన్న పిలుపు'.. ఏం చేస్తారంటే?
Recommended Video

అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. 'అన్న పిలుపు' పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ మేరకు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరిట తటస్థులకు లేఖలు రాయనున్నారు. కలిసి పని చేద్దామని, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్థానికంగా ప్రభావం చూపించగల వారిని ప్రశాంత్ కిషోర్ టీమ్ గుర్తించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో జేడీయూ పార్టీ కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు ఆయన వైసీపీ కోసం పని చేశారు. ఆయన టీం ఏపీలో స్థానికంగా ప్రభావం చూపగల వారిని గుర్తించింది.

లేఖలు రాస్తున్న జగన్
ప్రభావం చూపగలిగి, తటస్థంగా ఉండే నేతలకు జగన్ తొలుత లేఖలు రాయనున్నారు. ఆ తర్వాత వారిని నేరుగా కలవనున్నారు. ఏ పార్టీకి చెందకుండా, ఏ పార్టీలో లేకుండా, స్థానికంగా ప్రభావం చూపగలిగిన వారిపై వైసీపీ దృష్టి సారించింది. వారికి అన్న పిలుపు పేరుతో లేఖలు రాయనుంది. కలిసి పని చేద్దామని, పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి విధానాలు ఉండాలో సూచించాలని జగన్ తన లేఖలో ప్రభావం చూపగల తటస్థులకు రాశారు.

ఆ తర్వాత తటస్థులను కలిసి మాట్లాడుతారు
వారి నుంచి వచ్చే స్పందన ఆధారంగా జగన్ తటస్థులను కలిసి మాట్లాడనున్నారు. ఈ మేరకు పార్టీ రూపకల్పన చేసింది. వైసీపీ ఈసారి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా గ్రామాలు లేదా నగరాల్లోని కీలక తటస్థుల పేరును స్వయంగా పేర్కొంటూ ఈ లేఖలు వెళ్లనున్నాయి. వారికి నేరుగా పోస్టు చేయనున్నారు.

నేరుగా వారి పేరును ప్రస్తావిస్తూ
నేను నా పాదయాత్రలో భాగంగా అనేక గ్రామాల్లో, అనేక చోట్ల చాలామందిని కలిశానని, మీ ఊరుకు వచ్చినప్పుడు మీ గురించి నాకు తెలిసిందని, మీరు సమాజానికి చేస్తున్న కృషి, గ్రామాభివృద్ధి కోసం పడుతున్న శ్రమ తన దృష్టికి వచ్చిందని, మీ ద్వారా నేను స్ఫూర్తి పొందానని, మీరు చేస్తున్న పని హర్షణీయమని ఆ లేఖలో నేరుగా ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తి పేరుతో పంపించనున్నారు. తద్వారా నేరుగా అందరితో కనెక్టివిటీ పెంచుకున్నట్లుగా అయి, ఇది పార్టీకి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఇది వైసీపీ సరికొత్త ఎత్తుగడ.

ప్రజల్లోకి బాగా వెళ్తుంది
అలాగే పార్టీ కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పడం ద్వారా వారిని ఓ పెద్ద కార్యక్రమంలో భాగస్వాములను చేసినట్లుగా అవుతుందని, దీంతో ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుందని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు లేఖలు ఇప్పటికే దాదాపు సిద్ధమయిందని తెలుస్తోంది. మొదట లేఖలు, ఆ తర్వాత వారి నుంచి వచ్చిన స్పందనను బట్టి కలవనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications