పోలవరానికి వ్యతిరేకం కాదు, న్యాయం చేయండి: జగన్, రెచ్చగొడుతున్నారని దేవినేని
హైదరాబాద్: తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పోలవరంలో ప్రతిరోజూ ధర్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజి అక్కడ ఇవ్వడం లేదని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో 12వ రోజు ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన ఈ అంశంపై శనివారం మాట్లాడారు.
మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి అక్కడ ఏం జరుగుతోందో చూడాలని, కావాలంటే తాను కూడా వస్తానని ఆయన చెప్పారు. పదేళ్ల నుంచి భూసేకరణ జరుగుతున్నా ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాక గిరిజనులు కష్టపడుతున్నారని, నిర్వాసితులకు న్యాయం చేసి ప్రాజెక్టు కట్టడం న్యాయమని తెలిపారు. ఇలా అంటున్నాము కదా అని తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం అనే ముద్ర వేయొద్దని, తామెవ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
నిర్వాసితుల ఉసురు పోసుకోవద్దని, వాళ్లకు పరిహారం ఇచ్చి ప్రాజెక్టు కడితే అందరి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. పోలవరం గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదని అన్నారు.రామయ్యపేట, పైడిపాక, చేగొండపల్లి గ్రామాలను ఖాళీ చేయాలని రెండు నెలలుగా ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. పట్టిసీమలో ఎకరాకు 25 లక్షల చొప్పున ఇచ్చారని గుర్తు చేశారు.
భూసేకరణకు అయ్యే ఖర్చు ఎప్పుడూ ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం కన్నా తక్కువే ఉంటుందని, అలాంటప్పుడు పేదప్రజలను సంతృప్తిపరుద్దామని జగన్ అన్నారు. ప్యాకేజి తీసుకోనప్పుడు ఇవ్వడంలో తప్పేముందని, అప్పుడు తీసుకోలేదు కాబట్టి కొత్త చట్టాన్ని అనుసరించి తమకు పరిహారం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారని తెలిపారు.

కొందరు రెచ్చగొడుతున్నారు: దేవినే
వైయస్ జగన్ మాట్లాడిన అనంతరం భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కోట్లాదిమంది ప్రజలు హర్షించే ప్రాజెక్టు పోలవరమని చెప్పారు.
నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ విషయంలో పూర్తి న్యాయం చేస్తామన్నారు. కొందరు పోలవరం నిర్వాసితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అది సరికాదని విజ్ఞప్తి చేశారు.
చేగొండపల్లి గ్రామాన్ని శుక్రవారమే ఖాళీ చేయించినట్లు మంత్రి ఉమా మహేశ్వరరావు చెప్పారు. పైడిపాక, రామయ్యపేట గ్రామస్తులకు నచ్చజెబుతున్నామని అన్నారు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, ఆర్అండ్ఆర్, భూసేకరణ విషయాల్లో వాళ్లకు అనుకూలంగానే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications