రేషన్ వాహనంపై వైఎస్ జగన్ ఫోటో.. చూసిన ఎమ్మెల్యే, తెలిసిన మంత్రి ఏం చేశారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినా, పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఏపీలో ఇంకా అనేక చోట్ల గత ప్రభుత్వం తాలూకా చిహ్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో తొలి సంక్షేమ పండుగ అయిన పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేసింది.
రేషన్ సరుకుల వాహనంపై జగన్ ఫోటో
అయితే ఈ పింఛన్ల పంపిణీ సమయంలో ఇంకా గత ప్రభుత్వం తాలూకా గుర్తులతో కనిపించిన ఒక వాహనం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆగ్రహానికి కారణమైంది. అసలు ఏం జరిగిందంటే ఎల్ ఎన్ పేట మండలం ఎంబారం గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే అదే సమయంలో అక్కడ జగన్ ఫోటోతో ఉన్న రేషన్ సరుకుల వాహనాన్ని చూశారు.

దొంగల ఫోటోలతో రేషన్ పంపిణీనా.. మండిపడిన పాతపట్నం ఎమ్మెల్యే
ఒక్కసారిగా వాహనాన్ని చూసి విస్మయానికి గురయ్యారు. వెంటనే ఎమ్మెల్యే రేషన్ వాహనం వద్దకు వెళ్లి వాహనం పైన ఇంకా మాజీ సీఎం బొమ్మలు ఉన్నాయని ఎందుకు తొలగించలేదని వారిని ప్రశ్నించారు. దొంగల బొమ్మలతో సరుకులు ఎలా పంపిణీ చేస్తారని రెవెన్యూ సిబ్బంది పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అచ్చెన్నకు ఫోన్... చర్యలకు ఆదేశం
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపైన కూడా అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇంకా పాత ముఖ్యమంత్రి బొమ్మతో రేషన్ అందిస్తుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. వెంటనే అక్కడి నుండి మంత్రి అచ్చెన్నాయుడుకి ఫోన్ చేసి విషయం చెప్పారు. తహసిల్దార్ రాణి అమ్మాజీతో కూడా మాట్లాడారు. ఎండిఎం ఆపరేటర్, రేషన్ డీలర్లను తొలగించాలని రెవెన్యూ సిబ్బందికి మెమోలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్.. తహసీల్దార్ కు ఆదేశం
దీనిపై జిల్లా అధికారులకు నివేదిక అందజేస్తామని తహసిల్దార్ తెలిపారు. ఇదిలా ఉంటే పాత ఫోటోలను తొలగించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు, ఎండిఎం నిర్వాహకులు బేఖాతలు చేస్తూ జగన్ ఫోటో ఉన్న వాహనంతో సరుకులు పంపిణీ చేయడం పైన వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తహసిల్దార్ కి ఫోన్ చేసి సంబంధిత శాఖల అధికారుల పైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications