ఆది వెళ్లిపోతే జగన్ ఆలోచన: వైఎస్ వివేకానా, విజయమ్మనా?
కడప: తనకు గతంలో అత్యంత సన్నిహితుడైన ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడడంతో కడప జిల్లాలోని జమ్మలమడుగు శాసనసభా నియోజకవర్గం గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుత శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డికి దీటుగా ఎవరిని రంగంలోకి దింపాలనేది ఆయన ఆలోచన.
ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి టిడిపి నియోజకవర్గం ఇంచార్జీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవడానికి రామసుబ్బారెడ్డిని అంగీకరింపజేసేందుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రామసుబ్బారెడ్డి అంగీకరించకుండా టిడిపి నుంచి బయటకు రావాలనుకుంటే ఆయనను పార్టీలోకి ఆహ్వానించడానికి జగన్ సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరడానికి సిద్ధపడిన తరుణంలో జగన్ ఇటీవల జమ్మలమడుగురు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తన పర్యటనలో భాగంగా జగన్ తన పార్టీ నాయకులు, కార్యకర్తల మదిలో ఏముందో అడిగి తెలుసుకున్నారు.
పార్టీలోకి రావడానికి సిద్ధపడితే రామసుబ్బారెడ్డికే పార్టీ బాధ్యతలు అప్పగించాలనీ, వచ్చే ఎన్నికల్లో ఆయననే బరిలోకి దించాలన్న కోణంలో కూడా జగన్ తన అనుచరులు, పార్టీ నేతలతో తన అభిప్రాయాలు పంచుకున్నారని సమాచారం. రామసుబ్బారెడ్డి రాకపోతే జమ్మలమడుగు పార్టీ ఇంచార్జీగా బాబాయ్ వివేకానందరెడ్డిని నియమిస్తే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వివేకా అయితే అందరిని కలుపుకుని జమ్మలమడుగులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ని బలోపేతం చేస్తారని అన్నట్లు తెలుస్తోంది.
రామసుబ్బారెడ్డి రాకపోతే తమ కుటుంబం నుంచే ఎవరో ఒకరిని బరిలోకి దించుతామని కూడా జగన్ చెప్పారని అంటున్నారు. అవసరమైతే జగన్ తల్లి విజయలక్ష్మిని జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, వైఎస్ వివేకా వైపే జగన్ మొగ్గుచూపుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications