జగన్ ఎక్కడో నువ్వే చెప్పు: గంటా, ఫోన్ చేసి సింహాచలం ఈవోను కడిగేసిన మంత్రి
విజయనగరం: భోగాపురం విమానాశ్రయం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజకీయం చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం మండిపడ్డారు.
రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం వద్దా? చెప్పాలని ఆయన జగన్‌ను ప్రశ్నించారు. భూములు సేకరించకుండా విమానాశ్రయం ఎక్కడ నిర్మించాలో జగన్ చెప్పాలని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. విజ్ఞాన భవన్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో నిర్వహించే సాగరమాల ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఈ భేటీలో సముద్రతీర ప్రాంతం ఉన్న రాష్ట్రాలకు చెందిన ఇతర ముఖ్యమంత్రులు, ఆర్థిక, జలవనరులు, రైల్వే, గ్రామీణాభివృద్ధి, పర్యాటక, చిన్నతరహా పరిశ్రమలు, పౌర విమానయాన శాఖలకు చెందిన మంత్రులు హాజరవుతారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్‌లో కేంద్ర అంతర్గత జలరవాణా శాఖ కార్యదర్శి అమితాబ్ వర్మతో భేటీ అవుతారు. ఏపీలో అంతర్గత జలవనరుల అభివృద్ధిపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు.
దీపావళి నాటికి 12 లక్షల రేషన్ కార్డుల పంపిణీ: మంత్రి ప్రత్తిపాటి
దీపావళి పండుగ నాటికి రాష్ట్రంలో పన్నెండు లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా తెలిపారు. టీడీపీ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. రైతు రుణమాఫీని వ్యతిరేకించిన జగన్‌కు రైతుల గురించే మాట్లాడే హక్కు లేదన్నారు. రాజధాని నిర్మాణలో ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వాములు కావాలని సభాపతి కోడెల శివప్రసాద రావు పిలుపునిచ్చారు.
ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లు అరెస్ట్
చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పుత్తూరు, ఐరాల సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 12 మంది ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 67 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
సింహాచలం ఈవోను కడిగిపారేసిన గంటా
మంత్రి గంటా శ్రీనివాస రావు సింహాచలం ఈవోను సోమవారం నాడు కడిగిపారేశారు. భూముల విషయంలో దేవస్థానం బోర్డుకు, గ్రామస్థులకు వివాదం వచ్చింది. గ్రామస్థులు తాము పాతిన బోర్డులు పీకేశారని బోర్డు కేసులు పెట్టింది. దీంతో, వారు మంత్రి గంటాను కలిసి తమ బాధను చెప్పుకున్నారు.
దీంతో, గ్రామస్థులు ఉండగానే, ఈవోకు ఫోన్ చేసిన మంత్రి గంటా.. ఆయన పైన మండిపడ్డారు. కేసులు పెట్టారట అని, ఇది సరికాదని ఆయన పైన మండిపడ్డారు. జిరాయితీ భూముల్లో దేవస్థానం బోర్డులు పాతింది. వాటిని గ్రామస్థులు తీసేశారు.












Click it and Unblock the Notifications