బాబు దుబారా ఖర్చు లెక్క ఇదీ: జగన్, 'సీఎంకు పులివెందుల మెచ్చుకోలు'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీశారు. మంత్రులు, బిజెపి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. కేంద్రం వద్ద చంద్రబాబు గొప్పలకు పోతున్నారని అభిప్రాయపడ్డారు.
జగన్ మాట్లాడుతూ... కేంద్రం నుంచి తెస్తానని చెప్పిన ప్రాజెక్టులను చంద్రబాబు ఒక్కటైనా తెచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు కేంద్రానికి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతున్నారన్నారు. మాకు పనులు చేయకుంటే కేంద్రానికి మద్దతివ్వమని ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. అభివృద్ధి రేటు పైన జగన్ ఎద్దేవా చేశారు. కేంద్రం కంటే ఎక్కువ వృద్ధి రేటు అని గొప్పలు చెబుతున్నారన్నారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే మెథడాలజీ ఉంటుందని చెప్పారు. జగన్ చెప్పే మెథడాలజీ ఉండదని అభిప్రాయపడ్డారు.
జగన్ మాట్లాడుతూ... నేను మీ తప్పుడు ఫిగర్లు చూపిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు. కేంద్రం కంటే మన వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. భూముల ధరలు పెంచుతున్నామన్నారు.
విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, మున్సిపల్ ఛార్జీలు పెంచామన్నారు. మనం ఇంతగా ప్రజలను బాదుతున్నామన్నారు. ఇలాంటప్పుడు మన రెవెన్యూ ఎక్కువగా పెరగాలని, కానీ పెరగడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజలను ఇంతగా బాదుతున్నప్పటికీ మన రెవెన్యూ పెరిగింది కేవలం 13 శాతమే అన్నారు.

మనది ధనిక రాష్ట్రం అనుకోరా
దీనిని బట్టి మనం చెప్పే గ్రోత్ రేటు తప్పు కావాలి లేదా రెవెన్యూ రేటు తప్పు కావాలన్నారు. మన వృద్ధి రేటు కేంద్రం కంటే ఎక్కువ అని చెప్పడం సరికాదన్నారు. కేంద్రం కంటే ఎక్కువ వృద్ధి రేటు చూపిస్తే.. దేశం కంటే ఎక్కువ ఏపీ అన్నింటా ముందంజలో ఉందని భావిస్తుందన్నారు.
కేంద్రం వృద్ధి రేటు 7కు పైగా ఉంటే, ఏపీ వృద్ధి రేటు 10.99 చూపిస్తే.. కేంద్రం మనకు ఎలా సాయం చేస్తుందని ప్రశ్నించారు. మీ ఇమేజ్ పెంచుకునేందుకు రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. మనం దేశం కంటే అన్యాయమైన స్థానంలో ఉన్నామన్నారు.
చంద్రబాబు విపరీతమైన అబద్దాలు అడుతూ గ్రోత్ రేటు ఎక్కువ చూపిస్తున్నారన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఎందుకు బొంకుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అలాగే, ప్రాజెక్టుల పైన విమర్శలు చేశారు.
పులివెందుల ప్రజల సంతోషం: దేవినేని ఉమ
పోలవరం ప్రాజెక్టు 2018లోగా పూర్తవుతుందని, పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు ఇచ్చిన అపర భగీరథుడు దేవినేని ఉమ అన్నారు. గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల పంట కాపాడామని చెప్పారు. తాము చేసే మంచిని జగన్ అభినందిస్తే అభినందించవచ్చునని కానీ విమర్శలు సరికాదన్నారు.
కడప జిల్లాలోని బలపనూరు తదితర గ్రామాలకు మేం నీరు ఇచ్చామన్నారు. ముప్పై ఏళ్లుగా వాళ్లు నీళ్లివ్వలేదని, కానీ తాము పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకు ఇప్పుడు నీళ్లు ఇచ్చామని చెప్పారు. పులివెందుల ప్రజలు చంద్రబాబు నీరు ఇవ్వడం వల్ల సంతోషపడుతున్నారన్నారు.
సాక్షి మీడియా ఉందని జగన్ తమ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మీ తండ్రి జలయజ్ఞంలో 21వేల కోట్ల నుంచి 81 కోట్ల వరకు అంచనాలు పెంచారని విమర్శించారు. కానీ మేం తోటపల్లిని పూర్తి చేసి నీటిని ఇచ్చామన్నారు. పట్టిసీమను పూర్తి చేశామన్నారు. అవినీతి పత్రిక పెట్టుకొని ఇష్టారీతిగా వార్తలు రాయడం సరికాదన్నారు.
జగన్ మాట్లాడుతూ... నేను ఏం మాట్లాడను, వారు ఏం మాట్లాడారని అన్నారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెబుతూ, స్టోరేజ్ లేని పట్టిసీమను కట్టి, దుబారా చేస్తున్నారన్నారు. తాత్కాలిక సచివాలయంతోను డబ్బులు దుబారా చేస్తున్నారన్నారు.
చంద్రబాబు దుబారా ఖర్చు ఇదీ..!
మనం ఎక్కడకు వెళ్లినా మామూలు విమానాల్లో వెళ్లమని, ప్రయివేటు విమానాలు కావాలని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతి శంకుస్థాపనకు రూ.400 కోట్లు దుబారా చేశామన్నారు. తాత్కాలిక ఇళ్లకు రిపేర్లు, కార్యాలయాలకు రిపేర్లు.. అంటూ రూ.300 కోట్లు దుబారా చేస్తామని ఎద్దేవా చేశారు.
విదేశాలకు వెళ్లడం, ప్రయివేటు ప్లైట్లలో వెళ్లడం.. ఇలా ఎంతో దుబారా ఖర్చు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇంత దుబారా చేస్తుంటే.. ఏపీలో చాలా డబ్బులు ఉన్నాయని భావించరా అని ప్రశ్నించారు. మీ సొంత ఇమేజ్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు బెడతారా అని ప్రశ్నించారు.
విభజన సమయంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టు పైన హామీ ఇచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. పోలవరం పూర్తి పైన కంటే కాంట్రాక్టులు, కమిషన్ల పైన ఆయనకు చిత్తశుద్ధి అన్నారు. పోలవరం నత్త నడకన నడుస్తోందని ఆరోపించారు. అలాంటప్పుడు కాంట్రాక్టును ఎందుకు రద్దు చేయరన్నారు. పైగా ధరలు పెంచుకునేందుకు ఆ కాంట్రాక్టర్లకు అవకాశమివ్వడం విడ్డూరమన్నారు.
మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు తెలుగు ప్రజల ఆకాంక్ష అన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు విషయమై కాంట్రాక్టు రద్దు చేస్తే, వారు కోర్టుకు వెళ్లారన్నారు. ట్రాన్సుట్రాయ్ ప్రాజెక్టును మేం తీసుకు రాలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు గురించి ఇంతగా మాట్లాడుతున్న జగన్.. ఆయన పార్టీకి చెందిన నేత ఒకరు అడ్డుపడుతూ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కడప, పులివెందుల తదితర ప్రాంతాలకు తమ ప్రభుత్వం నీరు ఇచ్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications