అర్ధాంతరంగా ఏపీకి జగన్: ప్రెస్‌మీట్?: ఏం చెప్పబోతున్నారు?
Vinukonda Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
నెలన్నరలోనే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నర రోజుల్లో రాష్ట్రంలో సంభవించిన వరుస హత్యలు, అత్యాచార ఘటనలను రాష్ట్రపతికి వివరించాలని నిర్ణయించింది.

నడిరోడ్డుపై నరికి..
వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.
మాన, ప్రాణాలకు రక్షణ లేదా?
దీనిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించట్లేదంటూ విమర్శించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీని అణగదొక్కాలనే..
వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలనే ఏకైక కారణంతో టీడీపీ నాయకులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని ధ్వజమెత్తారు.
పరాకాష్టగా..
వినుకొండ హత్యోదంతాన్ని దీనికి పరాకాష్టగా అభివర్ణించారు జగన్. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శించారు.

రెడ్ బుక్ రాజ్యాంగం..
ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, ఫలితంగా నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని జగన్ అన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పారు.
దృష్టి పెట్టండీ..
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చోటు చేసుకుంటోన్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తిచేశారు.
కార్యకర్తలకు భరోసా..
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, వారికి, వారి కుటుంబాలకు అన్నిరకాలుగా అండగా ఉంటామనే భరోసా ఇస్తున్నానని జగన్ అన్నారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ జగన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
వినుకొండ హత్యతో..
వినుకొండ హత్యోదంతం అనంతరం వైఎస్ జగన్.. అర్ధాంతరంగా ఏపీకి తిరుగుబాట పట్టారు. రెండు రోజుల కిందటే ఆయన బెంగళూరుకు వచ్చారు. ఈ ఘటన తరువాత తాడేపల్లికి బయలుదేరనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
సాయంత్రం ప్రెస్‌మీట్?
ఈ మధ్యాహ్నం 1:15 నిమిషాలకు యలహంక నివాసం నుంచి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. 3:45కు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. 4 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తరువాత తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications