ఇంగ్లీష్ వచ్చా!, వీడియో చూడండి: బాబు-వెంకయ్యలను దులిపిన జగన్
ఏలూరు: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల పైన వైసిపి అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదా విషయంలో బిజెపి, టిడిపిలు మోసాలు, అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. హోదా కోసం రెండేళ్లుగా పోరాటం సాగుతోందన్నారు.

జైట్లీ అర్ధరాత్రి చెప్తే, బాబు స్వాగతించారు
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అర్ధరాత్రి సమావేశం పెట్టి హోదా ఇవ్వమని చెప్పారన్నారు. ఆ ప్రెస్ మీట్లో వెంకయ్య, సుజనా చౌదరిలు కూడా పాల్గొన్నారన్నారు. జైట్లీ ప్రెస్ మీట్ పెడతారని, ప్రత్యేక హోదా వస్తుందని, హోదాకు బదులు అంతకుమించిన ప్యాకేజీ వస్తుందని మీడియాలో ఊదరగొట్టారన్నారు. అర్ధరాత్రి పదకొండు గంటలకు జైట్లీ సమావేశం పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పారన్నారు. ఆ తర్వాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి ప్రెస్ ముందుకు వచ్చారన్నారు. మేం జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారన్నారు.

చంద్రబాబుకు ఇంగ్లీష్ వచ్చా
నాకు అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు ఆశ్చర్యం అనిపించిందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జైట్లీ చెప్పిన వ్యాఖ్యలకు స్వాగతిస్తున్నామని చెప్పడం ఏమిటన్నారు. అప్పుడు నాకు అనిపించింది.. చంద్రబాబుకు ఇంగ్లీష్ వచ్చా అనిపించిందన్నారు.

అదే మనిషి రెండున్నరేళ్ల తర్వాత ప్లేటు మార్చాడు
ఇదే చంద్రబాబు ఎన్నికల సమయంలో హోదా కావాలని డిమాండ్ చేశారని, అసెంబ్లీలో తీర్మానం చేశారని, అదే చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత ప్లేటు మార్చి ప్ర్తత్యేక హోదా వల్ల ఏం వస్తుందని చెప్పడం ఏమిటన్నారు. పట్టపగలు అబద్దాలు ఆడుతున్నారన్నారు. సీఎం చంద్రబాబుకు విదేశాల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారట అని, పీఏ తెచ్చి ఫోన్ ఇస్తే, ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెప్పారట అని, నేను దానిని పేపర్లో చదివానని చెప్పారు.

వెంకయ్య నాయుడు పైన..
కేంద్రమంత్రి వెంకయ్య పైన కూడా జగన్ ధ్వజమెత్తారు. వెంకయ్య కూడా ప్రత్యేక హోదా పైన ప్లేటు మార్చారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వద్దకు వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విడ్డూరమన్నారు. హోదా సంజీవిని, అయిదేళ్లు సరిపోదు పదేళ్లు కావాలన్న వెంకయ్య, చంద్రబాబులు ఇప్పుడు ఎందుకు ప్లేటు పిరాయించారన్నారు.

బాబు, వెంకయ్యలకు ప్రజలతో పని అయ్యాక
చంద్రబాబు, వెంకయ్యలు చాలా అన్యాయంగా మాట్లాడారన్నారు. ఎన్నికలప్పుడు ఒకరకంగా మాట్లాడి, ఎన్నికల తర్వాత ప్రజలతో పని అయిపోయిందన్న తీరున మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి దాకా హోదా గొప్పది అని చెప్పిన వ్యక్తులు.. ఇప్పుడు దాని వల్ల మేలు ఏమిటని ప్రశ్నిస్తున్నారంటే ఎంత గ్లోబెల్స్ ప్రచారం చేశారో అర్థమవుతోందన్నారు.

చంద్రబాబు ఎప్పుడు ఏమన్నారో వీడియోలో చూపించిన జగన్.. తిరుపతి వీడియో
తొలుత 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతిలో మాట్లాడిన వీడియోను చూపించారు. ప్రత్యేక హోదా పదేళ్లు కాదని, పదిహేనేళ్లు కావాలని చంద్రబాబు కోరిన వీడియో చూపించారు. మోడీని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత సీఎం హోదాలో ఢిల్లీలో, ఆ తర్వాత మరో మూడు నాలుగుసార్లు చెప్పిన అంశాలను చూపించారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు చెప్పడం నుంచి హోదాతో లాభమేమిటి అని చెప్పే వరకు ఉన్న వీడియోలను చూపించారు.

వెంకయ్య వీడియో
కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య 2014లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలోని వీడియోను చూపించారు. అందులో వెంకయ్య హోదాను కోరారు. ఆ తర్వాత తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ చెప్పిన దానిని, వెంకయ్య తర్జుమా చేసిన దానిని చూపించారు.

వీళ్లకు విలువల్లేవు
రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉండాలని జగన్ అన్నారు. ఎన్నాళ్లు బతికామన్నది కాకుండా ఎలా బతికామన్నది ముఖ్యమన్నారు. వెంకయ్య, చంద్రబాబులకు విలువలు, విశ్వసనీయత లేవన్నారు. నాడు వేడి మీద చెప్పామని చెప్పడం సరికాదన్నారు. ఓట్లు వేయించుకున్నాక ప్లేటు ఫిరాయించారన్నారు.












Click it and Unblock the Notifications