ఆత్మకూరు ఓటర్లకు జగన్ థ్యాంక్స్-ప్రభుత్వానికి మద్దతు-గౌతంకు నివాళిగా అభివర్ణన
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి 82 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. అదే సమయంలో సమీప ప్రత్యర్ధి, బీజేపీ అభ్యర్ధి కేవలం 10 వేల ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఆత్మకూరులో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయంపై సీఎం జగన్ స్పందించారు. గతంలో జరిగిన ఉపఎన్నికలే కాదు ఆత్మకూరులోనూ ప్రచారానికి దూరంగా ఉన్న వైఎస్ జగన్.. విక్రమ్ రెడ్డి ఘనవిజయంపై ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి అన్న, తన మాజీ కేబినెట్ సహచరుడు గౌతం రెడ్డిని సైతం జగన్ గుర్తు చేసుకున్నారు. ఉపఎన్నికల్లో వైసీపీకి ఘనవిజయం అందించిన ఓటర్లకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

"ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా... ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి... ప్రతి అవ్వకు, ప్రతి తాతకు... పేరుపేరునా ధన్యవాదాలు " అంటూ జగన్ ట్వీట్ చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! అంటూ మరో ట్వీట్ లో జగన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications