గేరు మార్చిన జగన్: కీలక భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమౌతున్నారు. వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తోన్నారు.
ఇటీవలే కృష్ణ జిల్లాలో పర్యటించారు జగన్. తుఫాన్, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టం గురించి ఆరా తీశారు. స్వయంగా రైతులను కలిసి, వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని వస్తోన్నారు. దీనికి అద్భుత స్పందన లభించిందని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు.

ఇప్పుడు మరోసారి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో సమావేశమవుతారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు ఈ భేటీ ఏర్పాటు కానుంది. విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తెర తీసిందంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోన్న విషయం తెలిసిదే. దీనికి నిరసనగా ఇప్పటికే ఛలో మెడికల్ కాలేజీల ఆందోళనను నిర్వహించింది కూడా. దీనిపై కోటి సంతకాల సేకరణను చేపట్టింది. అటు నిరుద్యోగ భృతి కోసం యువత పట్టుబట్టుతోంది. ఈ పరిస్థితుల మధ్య జగన్ కీలక భేటీని నిర్వహించబోతోన్నారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహరచన, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల అభివృద్ధి నిలిచిపోయిందని, కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి నెలకొందని వైసీపీ విమర్శిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువస్తే, వాటిలో అయిదు పూర్తయి ప్రజల సేవలోకి వచ్చాయని గుర్తు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సీట్లు కూడా వద్దని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాసిందని, దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని ఆరోపిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications