నాలుగు రోజుల్లో ఇచ్చారో సరే, లేదంటే...: జగన్ హెచ్చరిక
విశాఖపట్నం: ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మరణించివారి కుటుంబాలకు మరో నాలుగు రోజుల్లో సహాయం అందించకపోతే ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన గురువారంనాడు విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పర్యటించారు.
ధవళేశ్వరం ప్రమాద ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని ఆయన అన్నారు. ఆ ప్రమాదంలో 22 మంది మరణించినా కూడా వాళ్ల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు రాలేదని ఆయన అన్నారు. వచ్చిన మంత్రులు ఏదో మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలేసి పరిహారం ప్రకటించారని, కానీ అందులో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు.

తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన 22 మంది కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఇంతవరకు పరిహారం ఇవ్వకుండా ఎందుకు ఇలా మోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికి ప్రమాదం జరిగి 18 రోజులు అవుతున్నా ఇంత వరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు.
మంత్రులు అప్పుడు ప్రచారం కోసం నష్టపరిహారం ప్రకటించారని, ప్రచారం లభించే కార్యక్రమం ఉంటే చంద్రబాబు అక్కడికి వెళ్లి ఐదు లక్షల రూపాయలు అందిస్తారని, వీళ్లూ మనుషులే.. వీళ్లూ బాధితులే.. కానీ 5 లక్షల రూపాయల పరిహారం ఎందుకు ప్రకటించలేదని ఆయన అన్నారు.
వాళ్లకు ఇష్టం లేకపోతే తగ్గిస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరని ఆయన విమర్శించారు. ప్రభుత్వం దారుణంగా పనిచేస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications