అన్న పై షర్మిల పగ తీరిందా, కానీ - హైకమాండ్ కీలక అడుగు..!!
ఎన్నికల్లో జగన్ పరాజయం పాలయ్యారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. అదే సమయంలో జగన్ పైన సోదరి షర్మిల రాజకీయ యుద్దం చేసిందా. జగన్ ఓటమితో షర్మిల పగ తీరిందా. ఇంకా కొనసాగిస్తారా. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల వ్యవహార శైలి పైన సొంత పార్టీ నేతల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఏపీలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన మారుతోంది. మరి.. షర్మిల - జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి.
జగన్ ఓటమి వెనుక
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఎన్డీఏ పార్టీలతో పాటుగా పీసీసీ చీఫ్ గా షర్మిల సైతం జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టడంతో జగన్ పార్టీకి నష్టం చేకూర్చారు. వైఎస్ జగన్ పైనా విమర్శలు చేయడంలో ముందున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలోనూ జగన్ ను దోషిగా చూపిస్తూ రాష్ట్రమంతటా పర్యటిస్తూ కొంత వరకూ జగన్ ను డ్యామేజీ చేయగలిగారు. రాయలసీమలో ఎక్కువగా ముస్లిం, రెడ్డి సామాజికవర్గం ఓటర్లకు గండి కొట్టడంలో సక్సెస్ కాగలిగారు.

వైసీపీ ఓట్లకు గండి
కడప, జమ్మలమడుగు వంటి వైసీపీకి బలమైన నియోజకవర్గాలు వైసీపీ కోల్పోయిందంటే అందుకు వైఎస్ షర్మిల కారణమయ్యారనే వాదన ఉంది. కానీ, షర్మిల జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయయ్యారు. అన్న మీద కోపంతోనే కడప పార్లమెంట్ నుంచి బరిలోకి దిగారు. పరోక్షంగా టీడీపీ కూటమికి మేలు చేసారు.
మారుతున్న ఢిల్లీ లెక్కలు
కడపలో డిప్యూటి సిఎం అమ్జాద్‌భాషపై తెలుగుదేశం అభ్యర్థి రెడ్డిగారి మాదవి 18,860 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆఫ్జల్ ఖాన్‌కు 24,500 ఓట్లు వచ్చాయి. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇవే సమీకరణాలు కనిపించాయి. షర్మిల పైన ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. హైకమాండ్ కు ఫిర్యాదులు పంపుతున్నారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ లెక్కలతో ఏపీలోనూ వైసీపీ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. కానీ, జగన్ మాత్రం అన్నింటికీ మౌనంగానే ఉంటున్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో మారే రాజకీయాలకు అనుగుణం గా ఏపీలోనూ షర్మిల - జగన్ నిర్ణయాలు ఆసక్తిని పెంచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications