అవినాశ్ బెయిల్ రద్దు చేయండి - సుప్రీంలో సునీత, నేడు..!!
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ అంశం మరో మలుపు తీసుకుంది. తెలంగాణ హైకోర్టు మే 31న అవినాశ్ కు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అవినాశ్ కు బెయిల్ మంజూరు చేయటం పైన సునీత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అవినాశ్‌కి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో సవాల్ చేసారు. బుధవారం సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
అవినాశ్ వర్సస్ సునీత:వివేకా కేసులో ఎంపీ అవినాశ్ వర్సస్ సునీత పోరాటం కొనసాగుతోంది. ఈ కేసులో అవినాశ్ ఏడు సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. తనకు ఈ ఘటనతో సంబంధం లేదని..రాజకీయంగా కుట్ర జరుగుతోందని కోర్టులో అవినాశ్ వాదించారు. ఈ వాదనల సమయంలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని.

తనకు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హై కోర్టులో అవినాశ్ పిటీషన్ దాఖలు చేసారు. మధ్యలో వేసవి సెలవులు రావటంతో కోర్టు నిర్ణయం తీసుకోలేదు. దీంతో,అవినాశ్ సుప్రీంకు వెళ్లి హైకోర్టు వెకేషన్ బెంచ్ తన పిటీషన్ విచారించేలా ఆదేశాలు పొందారు. కేసు విచారించిన తెలంగాణ హైకోర్టు అవినాశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీంలో పిటీషన్:అవినాశ్ కు ఇచ్చిన బెయిల్ పైన ఇప్పుడు సునీత సుప్రీంను ఆశ్రయించారు. అవినాశ్‌కి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ని రద్దు చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులను ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీకోర్టులో సవాలు చేశారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులు లోపాలున్నాయని అమె తన పిటీషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటీషన్ పై ఈ రోజు (బుధవారం) వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. పిటీషన్ విచారణకు వస్తే సీబీఐ కూడా తమ వాదనలు వినిపించనుంది. అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని తన పిటీషన్ లో సునీత ప్రధానంగా కోరారు. ఇదే సమయంలో మరిన్న వాదనలు వినిపించేందుకు సిద్దమయ్యారు.
బెయిల్ పై సప్రీంకు:సునీత దాఖలు చేసిన పిటీషన్ లో సీబీఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు..అఫిడవిట్లలో అభియోగాలన్నీ తీవ్రమైనవేనని..హైకోర్టు వాటిని సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. జూన్ 30వ తేదీ లోగా దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ రద్దు చేసి దర్యాప్తు సజావుగా సాగేందుకు వీలు కల్పించాలని కోరారు.
హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ సమయంలో కోర్టులోనే సునీత ఉంటూ వాదనలు పరిశీలించారు. అవినాశ్ కోర్టులో దాఖలు చేస్తున్న పిటీషన్లలో సునీత ఇంప్లీడ్ అవుతూ.. అవినాశ్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంలో సునీత పిటీషన్ తో ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications