విజయమ్మ స్పెషల్ మీటింగ్ -వెనుక ఉన్నదెవరు : జగన్ నివాసంలో రెండు రోజులు: ఎత్తుగడ ఏంటి..!!
వైఎస్ విజయమ్మ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ తో పని చేసిన వారు..సన్నిహితులకు ఆహ్వానాలు పంపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావాలంటూ నాడు వైఎస్ తో అత్యంత ఆత్మీయంగా ఉన్న వారికి ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వారంతా వివిధ పార్టీల్లో ఉన్నా..వైఎస్ తో ఉన్న సఖ్యత ప్రామణికంగా ఈ ఆహ్వానాలు వెళ్తున్నాయి.

12 ఏళ్ల తరువాత మీటింగ్ వెనుక...
అయితే, అసలు విజయమ్మ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసారనేది ఇప్పుుడు చర్చకు కారణమైంది. జగన్ ఏపీలో అధికారంలో ఉన్నారు. కుమార్తె తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసారు. నాడు కుమారుడికి..తరువాత షర్మిలకు విజయమ్మ మద్దతుగా నిలిచారు. షర్మిల కొత్త పార్టీ ప్రకటన సమయంలోనూ వేదిక పంచుకున్న విజయమ్మ తన బిడ్డల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, వైఎస్సార్ మరణించి 12 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఏనాడు ఇటువంటి ప్రత్యేక సమావేశం నిర్వహించ లేదు.

ఎంపిక చేసిన వారికే ఆహ్వానం..
తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు ఇష్టం లేని జగన్..ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. షర్మిల- జగన్ మధ్య సైతం నాటి ఆత్మీయత నేడు ఈ రాజకీయాల కారణంగా కొంత దూరమైనట్లు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా షర్మిలతో ఉంటున్న విజయమ్మ..గత వారంలో రెండు రోజుల పాటు అమరావతిలో కుమారుడు జగన్ నివాసంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 2న వైఎస్సార్ కు ఇడుపులపాయలో నివాళి అర్పించిన తరువాత విజయమ్మ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే, ఈ సమావేశం గురించి జగన్ తో చర్చించారా లేదా అనే చర్చ జరుగుతోంది.

షర్మిలకు మద్దతు కోసమేనా..
హైదరాబాద్ కేంద్రంగా వైఎస్సార్ సన్నిహితులను పిలవటం ద్వారా విజయమ్మ ప్రస్తుత పరిస్థితుల పైన మనసులో మాటను షేర్ చేసుకుంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తోందని తన కుమార్తెకు మద్దతు కూడగట్టేందకే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, నాడు వైఎస్సార్ తో ఉన్న వారిలో చాలా మంది ఇతర పార్టీల్లో..మరి కొందరు రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో వారు విజయమ్మ కోరినా..తమ ఆలోచన మార్చుకొని షర్మిలకు మద్దతిచ్చే అవకాశం ఉందా అంటే లేదనేది విశ్లేషకుల అంచనా.

మీటింగ్ వెనుక ప్రశాంత్ కిషోర్..
అయితే, నాడు ఏపీలో జగన్ కు ...నేడు తెలంగాణలో షర్మిలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ టీం సూచనల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అయితే, ఈ సమావేశానికి షర్మిల హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. జగన్ మాత్రం సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించి అదే రోజు సాయంత్రానికి అమరావతి చేరుకుంటారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణలో ఉన్న వైఎస్సార్ అభిమానులను ఏకం చేయటానికి ఇదొక ప్రయత్నంగా కనిపిస్తోంది.

విజయమ్మ ప్రత్యేక ఆహ్వానాలు..
ఇందు కోసం విజయమ్మ గతంలో వైఎస్ తో దగ్గరగా పని చేసిన కేవీపీ, డీఎస్, సురేష్ రెడ్డి వంటి వారికి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఏపీ - తెలంగాణ నుంచి ఈ సమావేశానికి ఎవరు హాజరవుతారనేది మరో ఆసక్తి కర అంశంగా మారుతోంది. జగన్ అనుమతి తీసుకోకుండా విజయమ్మ ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయరనే చర్చ సైతం నడుస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ సమావేశం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహం దాగి ఉందనే ప్రచారం నడుమ..విజయమ్మ అసలు ఎత్తుగడలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications