పులివెందులలో సీబీఐ: నర్రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చిన మరుసటిరోజే
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న సీబీఐ అధికారులు ఇప్పటికే కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు.
ఈ పరిణామాల మధ్య తాజాగా వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసులో దీన్ని కీలక మలుపుగా భావిస్తోన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ విషయంలో విభేదాలు తలెత్తడం, ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి.. వివేకాను హత్యచేయించారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తోన్న నేపథ్యంలో- నర్రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు.
హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో సుమారు రెండు గంటల పాటు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆయన విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకా రెండో వివాహం చేసుకోవడం, ఆ దంపతులకు బాబు పుట్టడం, ఆస్తిని రాసివ్వాలనుకోవడం.. వంటి కోణంలో సీబీఐ తమ దర్యాప్తును మొదలు పెట్టిందనే అంచనాలు ఉన్నాయి.

ఈ దిశగా సీబీఐ అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ మధ్యాహ్నం వారు పులివెందులకు చేరుకున్నారు. పులివెందులకు చేరుకున్న సీబీఐ టీమ్‌లో మొత్తం ఆరుమంది ఉన్నట్లు చెబుతున్నారు. వైఎస్ వివేకా ఇంటిని వారు మరోసారి సందర్శించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించిన మరుసటి రోజే వారు పులివెందులకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలావుండగా- వైఎస్ భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇవ్వాళ కూడా విచారించారు. ఇది అయిదవ రోజు. వారిద్దరినీ ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. హత్య వెనుక గల కారణాలపై ఆరా తీశారు. అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.












Click it and Unblock the Notifications