తప్పించుకున్న కిరణ్: టిపై జగన్ పార్టీ, కిందపడ్డ శ్రీకాంత్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల వల్లనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు సోమవారం ఆరోపించారు. తెలంగాణ బిల్లు సభాపతి శాసన సభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో జగన్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు. వారు తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను చించివేసి, దగ్ధం చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెరాస శాసన సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పలువురు జగన్ పార్టీ ఎమ్మెల్యేల పైకి కుర్చీలు విసిరేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కిందపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

ఈ సందర్భంగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడారు. కిరణ్, చంద్రబాబుల వల్లనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చిందన్నారు. తెలంగాణ బిల్లు వచ్చే సమయానికి ముఖ్యమంత్రి దొడ్డిదారిన పారిపోయారని ధ్వజమెత్తారు. తాము విభజనకు పూర్తి వ్యతిరేకమన్నారు. కిరణ్, చంద్రబాబులు తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కిరణ్ వ్యూహాత్మకంగా సభకు రాకుండా తెలంగాణ బిల్లుకు సహకరించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర నేతలు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
బిల్లును వెనక్కి పంపాలి: పయ్యావుల
బిఏసిని పిలువకుండానే శాసన సభలో బిల్లు ఎలా ప్రవేశపెడతారని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన మాట్లాడారు. సభలో గందరగోళం ఉన్నప్పుడు బిల్లును ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇప్పటికైనా స్పీకర్ స్పందించి రాష్ట్రపతి పంపించిన బిల్లును వెంనటే తిప్పి పంపించాలన్నారు.












Click it and Unblock the Notifications