ప్రమాణానికి సిద్దం, దేవ దేవుని సాక్షిగా - చంద్రబాబుకు సవాల్..!!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పై చంద్రబాబు వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వైసీపీ హాయంలోతిరుమల లడ్డు తయారీలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వారంటూ చేసిన కామెంట్స్ పైన టీటీడీ మాజీ ఛైర్మన్లు తీవ్రంగా స్పందించారు. తిరుమలలో ఈ ఆరోపణల పైన ప్రమాణానానికి చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు నిజమైతే సీబీఐ విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేసారు.
చంద్రబాబు వ్యాఖ్యలతో
చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం పై చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు సీరియస్ అయ్యారు. టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఈ విషయంలో చంద్రబాబుకు సవాల్ చేసారు. రాజకీయం లబ్ధికోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని మరోమారు నిరూపితం అయ్యింది. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు.

మాజీ ఛైర్మన్ల ఆగ్రహం
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబునాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ మండిపడ్డారు. మరో మాజీ ఛైర్మన్ భూమన ఇదే వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల శ్రీవారి ప్రసాదంలో చంద్రబాబు చెప్పినట్లుగా ఎవరైనా అలా చేసి ఉంటే సర్వనాశనం అవుతారని పేర్కొన్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తే ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పుకొచ్చారు. తిరుమలను రాజకీయాల కోసం వాడకోవటం సరి కాదని వ్యాఖ్యానించారు.
విచారణ చేయించాలి
పీసీసీ చీఫ్ షర్మిల సైతం ట్వీట్ చేసారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఆమె అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications