అంగన్ వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్- ఆ డబ్బుల విడుదల..!
ఏపీలో అంగన్ వాడీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా ఒక్క రోజు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. గతంలో రాష్ట్రంలో వేతనాల పెంపు సహా పలు హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ అంగన్ వాడీలు సమ్మె చేశారు. ఆ సమయంలో వారి వేతనాల్లో కోత పడింది. ఆ బకాయిల్ని ఇప్పుడు చెల్లించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అందిన నివేదిక మేరకు గతంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేసిన కాలాన్ని విధి నిర్వహణలో ఉన్నట్లుగానే లెక్కిస్తూ ఆ కాలంలో చెల్లించాల్సిన వేతనాల్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ విడుదల చేసిన జీవోలో పేర్కొంది. గత డిసెంబర్ 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకూ మొత్తం 42 రోజుల సమ్మె కాలంలో చెల్లించాల్సిన వేతనాన్ని విడుదల చేసేందుకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో తెలిపింది.
గతేడాది అంగన్ వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగారు. ప్రభుత్వం వీరి సమ్మెను విరమింపజేసేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేసి మరీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వం పలు చోట్ల అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించి మరీ వాటిని తెరిపించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్ వాడీలు నిరసనలకు దిగారు. చివరకు ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో సమ్మెను విరమించారు.












Click it and Unblock the Notifications