ఆసుపత్రిలో చేరిన కొడాలి నాని - ఐసీయూలో చికిత్స
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడివాడ శాసన సభ్యుడు, పౌర సరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని.. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అనారోగ్య కారణంతో హాస్పిటల్‌లో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో కొడాలి నాని బాధపడుతున్నట్లు చెబుతున్నారు. సమస్య తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

చురుకైన నేత..
వైఎస్ఆర్సీపీలో చురుగ్గా ఉండే నాయకులు ఒకరు కొడాలి నాని. తరచూ మీడియా ముందుకు వస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై ఎవరు ఎలాంటి విమర్శలను గుప్పించినా వాటిని అప్పటికప్పుడు తిప్పి కొట్టడంలో ముందుంటారు. వైఎస్ జగన్‌ను విపరీతంగా అభిమానించే నాయకుల్లో ఒకడిగా కొడాలి నానికి గుర్తింపు ఉంది. సొంత జిల్లాకే చెందిన తోటి మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి రాజకీయ ప్రత్యర్థులపై కౌంటర్ అటాక్‌కు దిగుతుంటారు.

ప్రత్యర్థులపై ఎదురు దాడుల్లో..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలను గుప్పిస్తుంటారు. ఆ ముగ్గురు నాయకులు వైఎస్ జగన్‌పై చేసే విమర్శల దాడికి కొడాలి నాని ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రతిదాడిని చేస్తుంటారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తరచూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తుంటారు.

మీడియాకు దూరంగా..
కొద్దిరోజులుగా కొడాలి నాని మీడియా ముందుకు రాలేదు. ప్రత్యేకించి- విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించి వెళ్లిన తరువాత కొడాలి నాని ప్రెస్ మీట్ పెడతారని భావించినప్పటికీ అలా జరగలేదు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ఆర్సీపీపై చేసిన విమర్శలను కూడా ఆయన తిప్పి కొడతారని అందరూ అంచనా వేసినప్పటికీ- అది కార్యరూపం దాల్చలేదు.

ఆసుపత్రిలో అడ్మిట్..
దీనికి కారణం- ఆయన అనారోగ్యమేనని తెలుస్తోంది. కిడ్నీలో రాళ్లు చేరడం వల్ల కొడాలి నాని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటోన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. మూడు రోజులుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. గురువారం రాత్రి ఆయనకు శస్త్ర చికిత్సను చేశారు డాక్టర్లు. కిడ్నీలో రాళ్లను తొలగించారు. ఈ సర్జరీ విజయవంతమైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటోన్నారని, రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సమాచారం.

లేజర్ ట్రీట్‌మెంట్..
డిశ్చార్జ్ అయిన తరువాత కనీసం మరో మూడు వారాల పాటు కొడాలి నాని విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించినట్లు చెబుతున్నారు. పూర్తి విశ్రాంతి అవసరమౌతుందని అంటున్నారు. మళ్లీ రెండు వారాల తరువాత మరో దఫా చికిత్స ఉంటుందని, లేజర్ ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించేలా ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని తెలుస్తోంది. అప్పటివరకు కొడాలి నాని మీడియా ముందుకు రావడానికి అవకాశాలు తక్కువేనని సమాచారం.












Click it and Unblock the Notifications