పరకామణిలో 20 ఏళ్లుగా చోరీ? 100 కోట్ల రికవరీ-భూమన షాకింగ్..!
ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు తప్పిదాలపై వరుస విమర్శలు చేస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే భూమన చేసిన పలు విమర్శల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఆయనపై కేసులు నమోదు చేసింది. అయినా భూమన అస్సలు వెనక్కి తగ్గడం లేదు. ఇదే క్రమంలో ఇవాళ పరకామణిపై మరో సంచలన ఆరోపణ చేశారు.
తిరుమల పరకామణిలో గత 20 ఏళ్లుగా చోరీ జరుగుతుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఇందులో 15 ఏళ్లు చంద్రబాబు హయాంలోనే చోరీ జరిగిందన్నారు. దీన్ని తామే బయటపెట్టామని ఆయన గుర్తుచేశారు. తమ హయాంలోనే పరకామణిలో చోరీకి కారకుడైన రవికుమార్ ను పట్టుకున్నామని తెలిపారు. ఆయన నుంచి 100 కోట్ల ఆస్తుల్ని రికవరీ చేసినట్లు భూమన వెల్లడించారు. ఆయన్ను 15 ఏళ్లుగా చంద్రబాబు ఎందుకు పట్టుకోలేని భూమన ప్రశ్నించారు.

కాబట్టి పరకామణి వ్యవహారంలో దమ్ముంటే విజిలెన్స్ నివేదికను బయటపెట్టాలని భూమన సవాల్ విసిరారు. అసెంబ్లీలో దేవాదాయమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటికి రాదని ఆయన ప్రశ్నించారు. ఈ నివేదికపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. కాబట్టి పరకామణి చోరీ వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

టీటీడీ ఆస్తులు కొట్టేలనుకున్న వారు దొంగను పట్టుకుంటారా అని భూమన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరకామణిలో చోరీలు చేసిన రవికుమార్ కు తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయన్నారు. తాము సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని భూమన తెలిపారు. అసలు పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజ్ బయటపెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వానికి తాబేదార్లుగా ఉన్న వారితో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి రావని భూమన తెలిపారు.












Click it and Unblock the Notifications