గవర్నర్ వద్దకు 'రోజా' పంచాయతీ: డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి పిటిషన్
హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజాను తిరిగి అసెంబ్లీలోకి వెళ్లే విషయంలో నెలకొన్న వివాదం చివరకు రాజ్ భవన్‌కు చేరుకుంది. రోజా సస్పెన్షన్ తీర్మానంపై హైకోర్టు స్టే విధించినా స్పీకర్ సమావేశాలకు అనుమతి నిరాకరిచడంపై వైయస్ జగన్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
ఈ క్రమంలో లేక్‌వ్యూ అతిథిగృహం నుంచి రాజ్ భవన్‌కు పాదయాత్రగా వైసీపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. అయితే హైదరాబాద్‌లో గవర్నర్ అందుబాటులో లేరు. ముందుస్తుగా గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించినప్పటికీ, ఆయన ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన బెంగుళూరు పర్యటనక వెళ్లినట్లు తెలుస్తోంది.

దీంతో గవర్నర్ కార్యాలయానికి చేరుకున్న వైయస్ జగన్‌తో పాటు వైపీసీ ఎమ్మెల్యేలు గవర్నర్ సెక్రటరీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ సమావేశాల్లోకి అనుమతించకపోడవంపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘించారంటూ చీఫ్ మార్షల్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలోకి రోజాకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. రోజాను సభలోకి అనుమతించాలంటూ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు.
ప్రభుత్వ ఏకపక్ష వైఖరి నిర్ణయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తుల కన్నా, స్పీకరే ఉన్నత స్థాయిలో ఉన్నారని చెబుతూ, కోర్టు ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పీకర్ కోడెల కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మార్షల్స్ చెబుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాకు తెలిపారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రోజా సస్సెన్షన్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం డివిజెన్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఈరోజే విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ కోరారు.
అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ చేపడతామని చెప్పింది.












Click it and Unblock the Notifications