Anantha Babu Case: ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం షాక్-పోలీసులూ కుమ్మక్కు..!
ఏపీలో సొంతకారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ( anantha babu)కు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఆయనపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసులు అనంతబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించింది. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సదరు పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ హత్య కేసులో ఆయన పాత్రపై తగిన ఆధారాలు ఉన్నా పోలీసులు ఆయనతో కుమ్మక్కై డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జిషీట్ దాఖలు చేయడంపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. అప్పట్లో పోలీసులు ఆయనతో కుమ్మక్కైనట్లు అర్దమవుతోందని వ్యాఖ్యానించింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధర్మాసనం నిలదీసింది. డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని అడిగింది. దర్యాప్తు చేయడం రాకపోతే సీబీఐకి ఈ కేసు అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించింది.

అనంతబాబు కేసులో ప్రస్తుతం ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణను రోజువారీ జరిగేలా చూడాలని ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణకు మార్చి 31లోగా సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఆదేశించింది. అలాగే హైకోర్టును ఈ కేసును స్వయంగా పర్యవేక్షించాలని, అలాగే ఈ కేసు విచారణకు అడ్డంకులు కలిగించవద్దని తెలిపింది. పరిస్ధితి చూస్తుంటే ఇప్పటికీ పోలీసులు, నిందితుడు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications