అన్ని బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ..! ఏపీలో డిమాండ్లు..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు సిద్దమవుతోంది. అయితే ఇందులో భాగంగా ఐదు రకాల సర్వీసుల్లో మాత్రమే ఈ ప్రయాణాన్ని అనుమతిస్తామని, అలాగే ప్రీమియం సర్వీసులైన నాన్ స్టాప్, ఏసీ, ఇతర సర్వీసుల్లో అనుమతించబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇప్పుడు అన్ని రకాల బస్సుల్లోనూ మహిళల ప్రయాణానికి అనుమతించాలన్న డిమాండ్లు మొదలయ్యాయి.
మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు షరతులు లేకుండా అన్ని రకాల బస్సుల్లో అనుమతించాలని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చని, తాను సేఫ్ డ్రైవర్‌గా ఉంటానని చెప్పిన చంద్రబాబు.. ఏడాది తర్వాత పథకాన్ని అమలు చేస్తూ దాన్ని 5 రకాల సర్వీసులకు మాత్రమే ఎలా పరిమితం చేస్తారని ప్రశ్నించారు.

ఐదు రకాల సర్వీసుల్లో మొత్తం 6,700 బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పి మరోసారి వంచనకు తెరదీశారని ఎమ్మెల్సీ కళ్యాణి విమర్శించారు. అంతర్ జిల్లాల పరిధిలో తిరిగే 90 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశం లేనప్పుడు పథకం అమలు చేయడం దేనికని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో అంతా ఉచిత ప్రయాణమే అంటూ ఊదరగొట్టారని, తీరా చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి ఐదు రకాల బస్సులకు మాత్రమే వర్తింపచేస్తారంట అన్నారు.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా అవి సగటున 40-50 కిలోమీటర్లకు దాటదన్నారు. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా 30 కిలోమీటర్లు దాటి వెళ్లవన్నారు. ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా గరిష్టంగా ఒక రూటులో 150 కిలోమీటర్లకు మించి వెళ్లవన్నారు. పైగా వీటి సంఖ్య చాలా తక్కువన్నారు. అంటే ఈ లెక్కన జిల్లాల సరిహద్దులు దాటి వెళ్లే బస్సులు చాలా తక్కువని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో 5 రకాల బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తింపజేస్తామని ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. కొత్తగా ఇప్పుడు ఎందుకు షరతులు పెడుతున్నారని నిలదీశారు. నిజాయితీగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలంటే రాష్ట్రంలో ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లే డీలక్స్, అల్ట్రా డీలక్స్, వెన్నెల, అమరావతి, ఇంద్ర, గరుడ బస్సుల్లో కూడా ఎక్కనిస్తారా? మీరు ఎన్నికలకు ముందు టీవీ యాడ్స్ లో ప్రచారం చేసుకున్నట్టుగా తిరుపతి, అన్నవరం, విజయవాడ, సింహాచలం, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి దేవాలయాలకు మహిళలని మొక్కులు తీర్చుకునేందుకు ఈ బస్సుల్లో ఉచితంగా వెళ్లనిస్తారా లేదా అని అడిగారు.

ఉచిత బస్సుకి నెలకు అయ్యే ఖర్చు రూ.300 కోట్లకు మించదని, అంటే ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్లని ఎమ్మెల్సీ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. ముగ్గురూ స్పెషల్ ఫ్లైట్స్, చాపర్‌లలో తిరగడానికి అయ్యే ఖర్చు కన్నా ఇది తక్కువే అవుతుందన్నారు. రాష్ట్రంలో తిరుగుతున్న అన్ని బస్సుల్లో మహిళలకు షరతులు లేకుండా ఉచిత ప్రయాణం హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications