సాయిరెడ్డి మళ్లీ యాక్టీవ్ గా.. ఎన్నికల వేళ కీలక బాధ్యతల్లోకి..!!
ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. కొంత కాలంగా సాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేరనే వాదన ఉంది. తారకరత్న మరణం...ఆ తరువాత సాయిరెడ్డి పార్టీ కీలక నిర్ణయాల్లో దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి...ఇప్పుడు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం అయ్యారు. దిశా నిర్దేశం చేసారు.
మౌనం వీడిన సాయిరెడ్డి : 2019 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విజయ సాయిరెడ్డి కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా వ్యవహరించిన ఆయన్ను పార్టీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అదే సమయంలో పార్టీ అనుబంధం సంఘాల ఇంఛార్జ్ గా నియమించింది. నందమూరి తారకరత్న మరణం సమయంలో సాయి రెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తారకరత్న సతీమణి సాయిరెడ్డికి బంధువు.

బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న చికిత్స నుంచి ఆయన మరణం తరువాత కార్యక్రమాలు పూర్తయ్యే వరకూ నందమూరి బాలయ్యతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతోనూ కలిసే ఉన్నారు. ఆ తరువాత కొంత కాలంగా టీడీపీ, చంద్రబాబు పైన సహజంగా చేసే ట్వీట్లకు సాయిరెడ్డి దూరంగానే ఉన్నారు.
తిరిగి యాక్టివ్ గా కార్యక్రమాల్లో : తిరిగి కొద్ది రోజులుగా చంద్రబాబుపైన గతంలో లాగానే ట్వీట్లు ప్రారంభించారు. విజయసాయిరెడ్డి పార్టీలో కీలకంగా లేకపోవటం పైన సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా తిరిగి సాయి రెడ్డి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనూ సాయిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు.
పార్టీ సీనియర్ నేత బాలినేని సొంత జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయం కారణంగా పార్టీ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రిని కలిసినా..తిరిగి బాధ్యతలు చేపట్టం పైన నిర్ణయం వెల్లడించలేదు. ఆ సమయంలో బాలినేని పర్యవేక్షించిన బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు.

ఎన్నికల వేళ కీలకంగా : అనుబంధ సంఘాల నేతలకు సాయిరెడ్డి కీలక మార్గనిర్దేశం చేసారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పని చేశాయో...అలాగే 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు..పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని సాయిరెడ్డి సూచించారు. జరిగింది.
వివిధ సామాజిక వర్గాలకు, విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు,కార్యక్రమాలు ఇంటింటికీ ప్రచారం ఎలా చెయ్యాలనే అంశం పైన చర్చ జరిగింది. జయహో బిసి మహాసభ ఎలా అయితే విజయవంతమైందో త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ, ఎస్టీ ,ముస్లిం మైనారిటీ, మహాసభలు విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చెయాలని సాయిరెడ్డి సూచించారు.












Click it and Unblock the Notifications