2.7 కోట్ల మందికి ట్రైన్ టికెట్లు కన్ఫమ్ కాలేదట- కేంద్రమంత్రికి సాయిరెడ్డి ట్వీట్
దేశవ్యాప్తంగా రైల్వేల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత రైళ్లన్నీ పోయి వాటి స్ధానంలో వందే భారత్ వంటి కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి. అయినా ఇంకా ప్రయాణికులకు టికెట్లు లేక ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భాలు పెరిగిపోతున్నాయి. ఇలా గత ఏడాది 2.7 కోట్ల మంది వెయిటింగ్ లిస్ట్ కారణంగా టికెట్లు లేక ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన పరిస్ధితి. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు.
దేశంలో కోవిడ్ రాక ముందు భారీ ఎత్తున రైళ్లు నడిచేవి. కానీ కోవిడ్ కారణంగా వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ ఆ తర్వాత తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులకు టికెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై రైల్వే మంత్రికి తాజా అప్ డేట్ ఇస్తూ, సమస్య పరిష్కారనికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ఇందులో సాయిరెడ్డి.. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ముందు ఓ కీలక డిమాండ్ పెట్టారు.

గత ఆర్ధిక సంవత్సరంలో టికెట్లు బుక్ చేసుకుని, వెయిట్ లిస్ట్ లో టికెట్లు కన్ ఫమ్ కాక 2.7 కోట్ల మంది రైలు ప్రయాణానికి దూరమయ్యారని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి రైల్వేమంత్రికి తెలిపారు. కోవిడ్ కు ముందు నడిపిన రైళ్లు పునరుద్ధరించకపోవడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. కాబట్టి ఆ రైళ్లన్నీ తిరిగి నడపాలని రైల్వేమంత్రి వైష్ణవ్ కు సాయిరెడ్డి సూచించారు. అలాగే కొత్త రైళ్లను ప్రకటించాలని, అన్ని రైళ్లలోనూ జనరల్ కంపార్ట్ మెంట్లను కూడా పెంచాలని కూడా కోరారు.

కోవిడ్ తర్వాత వందే భారత్ వంటి కొత్త రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెడుతున్నా.. వాటిలో జనరల్ టికెట్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న రైళ్లలో ఉన్న జనరల్ కంపార్ట్ మెంట్లను సైతం తగ్గించేయడంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే వందే భారత్ వంటి రైళ్లకు డిమాండ్ ను పెంచేందుకే రైల్వే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications