విపక్షాల అవిశ్వాస తీర్మానంపై సాయిరెడ్డి ఫైర్-కేంద్రానికి అండగా ఉండాలని ట్వీట్..!
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్ష ఇండియా కూటమి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చింది. విపక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గగోయ్ ఈ నోటీసు ఇచ్చారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
అన్ని పార్టీలతో చర్చించి తీర్మానంపై చర్చ, ఓటింగ్ కు సమయం నిర్ణయిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ విపక్షాల అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా స్పందిస్తోంది.
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న స్పష్టం చేసింది. ఇవాళ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ.. విపక్షాలపై నిప్పులు చెరిగారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి లాభం ఏంటని వారిని ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు ఇలాంటి సమయంలో కేంద్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని విపక్షానికి నీతులు చెబుతూ ఇవాళ ఓ ట్వీట్ కూడా చేశారు.

విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల దేశానికి ఏం లాభం అని ప్రశ్నిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ చేశారు. రెండు శత్రు దేశాలు కాచుకుని కూర్చున్న వేళ, మణిపూర్ మండుతున్న వేళ కేంద్రాన్ని బలహీన పర్చాలని చూడటం జాతి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. అలాగే ఇది అందరూ కలిసి పనిచేయాల్సిన సమయమని, పరస్పరం వ్యతిరేకంగా పనిచేయాల్సిన సమయం కాదన్నారు. కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు.
ఇప్పటికే ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని కొనసాగిస్తోంది. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ తో పాటు ఉమ్మడి పౌరస్మృతిపై బిల్లులు ప్రవేశపెట్టి నెగ్గించుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు కూడా వైసీపీ అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఎన్డీయే కు వ్యతిరేకంగా పనిచేస్తున్న విపక్షాల్ని టార్గెట్ చేయడం ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications