ఇక రంగంలోకి దిగండి..!!
బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాన్ మొంథా.. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భీతావహంగా మారుతోంది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్.. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. తీరాన్ని దాటుతున్న సమయంలో అంచనాలకు అందని విధంగా బీభత్సాన్ని సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు దక్షిణ ప్రాంతం వరకూ అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.
ప్రస్తుతం బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ-మధ్య ప్రాంతం గుండా తీరం ఏపీ తీరం వైపు దూసుకొస్తోందీ తుఫాన్. చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశగా 520, విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయం దిశలో 640, కాకినాడకు ఆగ్నేయ దిశలో 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రికి మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

ఆ సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని తీవ్రత 110 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే- పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
సన్నద్ధతలో భాగంగా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు మొత్తం 19 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణ, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కోటి రూపాయలు చొప్పున, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలకు రూ. 50 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి..
ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించ తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, ర్యాలీలను వాయిదా వేశారు. నవంబర్ 4వ తేదీన ఈ ర్యాలీలను నిర్వహిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఈ ర్యాలీలను చేపట్టాల్సి ఉంది.
అదే సమయంలో పార్టీ క్యాడర్ కు కూడా దిశానిర్దేశం చేశారు జగన్. రాష్ట్రానికి మోంథా తుఫాన్ ముప్పు ముంచుకొస్తోందని, దీని ప్రభావంతో జిల్లాలో రానున్న అయిదు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించారు. అవసరమైన సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications