టీడీపీ, వైసీపీ సవాళ్లతో వేడెక్కిన విశాఖ- ఎమ్మెల్యే వెలగపూడి ఇంటికి భారీ భద్రత
దివంతగత నేత వంగవీటి మోహనరంగా హత్యపై వైసీపీ, టీడీపీ మధ్య మొదలైన మాటల యుద్దం విశాఖ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. రంగా హత్య నిందితుడంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణపై మాటల యుద్ధం ప్రారంభించిన వైసీపీ, అనంతరం ఆయన రౌడీయిజం చేశారని, కబ్జాలు చేశారని వరుస ఆరోపణలు చేస్తోంది. దీంతో ఆయన సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
తనపై చేసిన ఆరోపణలు నిజమని వైసీపీ నేతలు సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ విసిరిన సవాల్ కు అధికార పార్టీ స్పందించింది. తమ ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు సిద్ధమని విశాఖ తూర్పు వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయనిర్మల ప్రకటించారు. దీంతో వెలగపూడి సవాల్‌ను వైసీపీ స్వీకరించినట్లయింది. సవాల్‌కు సిద్ధపడి ఎమ్మెల్యే రామకృష్ణ, విజయనిర్మల ఇద్దరూ ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయిబాబా గుడికి వస్తారన్న సమాచారంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

అలాగే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు దిగొచ్చనే సమాచారంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రత పెంచారు. సాధారణంగా ఎమ్మెల్యే ఇంటికి కల్పించే భద్రతకు అదనంగా మరికొందరు పోలీసులను పంపారు. అసలే ఇవాళ రంగా వర్దంతి కూడా కావడంతో ఈ సాకుతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసనకు దిగే అవకాశం కూడా ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంటోంది.












Click it and Unblock the Notifications