స్థానిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. వైసీపీ కీలక డిమాండ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. దీనిపై ఇప్పటికే కూటమి పార్టీలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించాయి. పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై మంతనాలు సాగించాయి.
ఈ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో భద్రతను పటిష్టం చేయాలని, కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖను సమర్పించింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠాను కలిసి వినతిపత్రం అందజేసింది.

గతంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పలు అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు తమ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని అన్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి, కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించాలని చెప్పారు.
వైసీపీ ప్రతినిధులు సమర్పించిన ఈ వినతిపత్రంపై అనిల్ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం, ప్రతి ఓటరుకు భద్రతా భావాన్ని కల్పించడం ఎన్నికల సంఘం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లేఖలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ వినతిపత్రాన్ని డీజీపీ కార్యాలయానికి కూడా పంపించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ఎన్నికల ప్రక్రియ అంతా నిష్పక్షపాతంగా సాగేలా చూడాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఏపీ డీజీపీని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా గట్టి నిఘా ఉంచాలని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు తగిన రక్షణ కల్పించేలా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తక్షణమే సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications