ఇంకెన్నాళ్లు.. పవన్ మాట నిలబెట్టుకో, రంగంలోకి దిగు: రాజధాని రైతులు
ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీని నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులు షాకిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు ధర్నాకు దిగారు.
అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీని నిలదీసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులు షాకిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులు ధర్నాకు దిగారు.
భూసమీకరణ నుంచి పెనుమాక, ఉండవల్లిని తప్పించాలని నినాదాలు చేశారు. పెనుమాకలోని రామాలయం వద్ద సుమారు అరగంట పాటు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేశారు.
రెండేళ్ల కిందట తమను ఆదుకుంటామని మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఈ సందర్భంగా వారు లేఖ రాశారు. తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతులు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

నాడు రైతులకు పవన్ హామీ
2015 ఆగస్టు 23న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. భూసమీకరణ వ్యతిరేకిస్తున్న రైతులతో మాట్లాడారు.

ధర్నాకు దిగుతానని పవన్ హెచ్చరిక
రాజధాని నిర్మాణానికి బలవంతపు భూసేకరణ చేయడానికి వీలు లేదని, అలాచేస్తే తాను కచ్చితంగా ధర్నాకు దిగుతానని ఆ రోజు జనసేన అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఒప్పించి తీసుకోవాలని..
తాను రాజధానికి వ్యతిరేకం కాదనీ, ప్రజలను ఒప్పించి భూసమీకరణపై వాళ్లకు నమ్మకం కలిగించి భూములు తీసుకోవాలని, అలా అయితే ఎవరికీ అభ్యంతరం లేదని చెప్పారు.

రైతులకు అండగా నిలుస్తానని..
భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలిపివేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. తాను రైతులకు అండగా నిలుస్తానని రాజధాని ప్రాంత రైతులకు పవన్ భరోసా ఇచ్చారు. కానీ, ఇప్పటి దాకా హామీ నెరవేరలేదని, పవన్ రంగంలోకి దిగాలని వారు కోరారు.












Click it and Unblock the Notifications