ఒక్క రాత్రికి ఏకంగా రూ. 5 లక్షలు! బ్రిక్స్ దెబ్బకి హోటళ్లకు పట్టిన అదృష్టం
దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రస్తుతం అంతర్జాతీయ దౌత్యానికి మాత్రమే కాకుండా, హోటల్ రంగానికి కూడా అసాధారణమైన వ్యాపార కేంద్రంగా మారిపోయింది. 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రపంచ దేశాల అగ్రనేతలు, విదేశీ దౌత్యవేత్తల రాకతో ఢిల్లీలోని స్టార్ హోటళ్లకు ఊహించని డిమాండ్ పెరిగింది. సాధారణ రోజుల్లో దొరికే రూమ్‌ల ధరలు ఇప్పుడు ఏకంగా నాలుగు రెట్లు పెరిగిపోగా, లగ్జరీ సూట్ రూమ్స్ అద్దె ఒక్క రాత్రికి ఏకంగా రూ. 5 లక్షలు దాటడం గ్లోబల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
వీఐపీ ల్యాండింగ్.. ఆకాశాన్ని తాకిన రూమ్ రెంట్లు!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బస చేసిన ఐటీసీ మౌర్య (ITC Maurya) హోటల్లో అత్యున్నత కేటగిరీ రూమ్ ధర ఒక్క రాత్రికి రూ. 2.5 లక్షల వరకు పలుకుతోంది. ఇక 'ది లలిత్' (The Lalit) హోటల్లో లెగసీ సూట్ ధర సెప్టెంబర్ 11, 12 తేదీలకు రాత్రికి ఏకంగా రూ. 5 లక్షలు దాటిపోయింది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, వారం రోజుల తర్వాత ఇదే సూట్ రూ. 1.1 లక్షలకే అందుబాటులో ఉండటం గమనార్హం. ఒబెరాయ్, తాజ్ మహల్ వంటి ప్రముఖ హోటళ్లలో అసలు రూమ్‌లే ఖాళీ లేక 'సోల్డ్ అవుట్' బోర్డులు పెట్టేశారు. పర్యటనల బుకింగ్స్ నెట్వర్క్ 'ట్రావ్క్లాన్' కథనం ప్రకారం.. ఢిల్లీలోని హోటల్ గదుల సగటు ధరలు ఆగస్టుతో పోలిస్తే ఒక్కసారిగా 30 నుంచి 40 శాతం వరకు పెరిగాయి.
#WATCH | Amit Biswas, Executive Sous Chef, The Lalit, New Delhi, says the BRICS menu is showcasing India through millets, traditional vegetables, Indian spices and farm-grown produce, with a focus on local ingredients.
— DD News (@DDNewslive) September 11, 2026
He adds that the menu has been thoughtfully curated so… pic.twitter.com/ZsPyRH37yY
మాన్సూన్ సీజన్లో మైండ్ బ్లాకింగ్ బిజినెస్!
సాధారణంగా సెప్టెంబర్ నెల వర్షాల వల్ల పర్యాటక రంగానికి కొంత నెమ్మదిగా ఉండే కాలం. కానీ, ఈ బ్రిక్స్ సదస్సు దెబ్బకు ఢిల్లీ హోటల్ పరిశ్రమకు ఊహించని మహర్దశ పట్టింది. రాడిసన్ హోటల్ గ్రూప్ ప్రతినిధుల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి రూమ్ టారిఫ్‌లు 25 శాతానికి పైగా పెరిగాయి.
కేవలం దౌత్యవేత్తలే కాకుండా కార్పొరేట్ పర్యటనలు, పర్యాటకులు, కాన్ఫరెన్స్‌లు ఒకేసారి తోడవడంతో ఈ రికార్డు డిమాండ్ నమోదవుతోంది. భారతదేశంలో మైస్ (MICE - సమావేశాలు, ప్రదర్శనల) రంగం హోటళ్ల రాబడిలో 15 నుంచి 25 శాతం వాటాను కలిగి ఉంటూ ఈ రంగాన్ని పరుగులు పెట్టిస్తోందని పరిశ్రమ నిపుణులు చెప్తున్నారు.
పెరిగిన గిరాకీ.. బయటపడ్డ మౌలిక వసతుల కొరత!
ఈ అసాధారణ ధరల పెరుగుదల ఢిల్లీలోని లగ్జరీ రూమ్‌ల కొరతను మళ్లీ తెరపైకి తెచ్చింది. కేవలం మూడు వారాల క్రితం రూ. 18,000 ఉన్న ఫైవ్ స్టార్ రూమ్ ధరలు ఇప్పుడు రూ. 80,000 దాటేశాయని అట్రావెల్క్యూ వ్యవస్థాపకులు ప్రశాంత్ దారోచ్ తెలిపారు.
గతంలో జరిగిన జీ20 (G20) సదస్సు, ఏఐ ఇంపాక్ట్ సమిట్ సమయాల్లో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఢిల్లీ అంతర్జాతీయ వేదికగా మారుతున్నప్పటికీ, నగరం మొత్తంలో కేవలం 21,000 బ్రాండెడ్ హోటల్ రూమ్‌లు మాత్రమే అందుబాటులో ఉండటంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఈ సమస్యను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications
