EPFO: ప్రతి కార్మికుడికీ పింఛను, కేంద్రం సంచలన ప్రకటన!
దేశంలోని కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతోంది. నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, వ్యవసాయ కూలీలు వంటి అసంఘటిత రంగంలోని వారిని కూడా 'ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ' ( EPFO), 'ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ' (ESIC) పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఈ కీలక సమాచారాన్ని వెల్లడించారు.
దేశంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ తర్వాత పింఛను అందాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు. "పనిచేసే ప్రతి చేతికీ సామాజిక భద్రత కల్పించడమే మా లక్ష్యం. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించే దిశగా కార్మిక శాఖలో విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి" అని ఆమె వివరించారు. దీనివల్ల వృద్ధాప్యంలో కార్మికులు ఎవరిపై ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించే అవకాశం కలుగుతుంది.

గిగ్ వర్కర్లు.. ఆన్‌లైన్ రంగ నిపుణులకు ఊరట!
మారిన కాలానికి అనుగుణంగా ఆన్‌లైన్ రంగంలో (Gig Workers) పనిచేస్తున్న వారిని కూడా పింఛను పథకం పరిధిలోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఫుడ్ డెలివరీ బాయ్స్, ఈ-కామర్స్ డ్రైవర్లు వంటి వారి భద్రతపై కూడా దృష్టి సారించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ( EPS) ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతికతను జోడిస్తున్నట్లు వెల్లడించారు.
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌తో చెంతకే సేవలు!
పింఛనుదారులు తమ ఉనికిని నిరూపించుకోవడానికి గతంలో పడిన ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం 'డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్' సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటి నుంచే ఉచితంగా ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే సదుపాయం వల్ల వృద్ధులకు పెద్ద ఊరట లభించినట్లయిందని మంత్రి పేర్కొన్నారు. కేవలం పింఛను ఇవ్వడమే కాకుండా, ఆ ప్రక్రియను సులభతరం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఆమె వివరించారు.
అసంఘటిత రంగాన్ని ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి తీసుకురావడం అనేది భారత ఆర్థిక వ్యవస్థలో ఒక పెనుమార్పుగా మారుతుంది. దీనివల్ల కార్మికులకు వైద్య సదుపాయాలతో పాటు ఆర్థిక భద్రత కూడా లభిస్తుంది.












Click it and Unblock the Notifications