EPS 95 Pension: ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిన కేంద్రం..! తాజా క్లారిటీ..!
ఉద్యోగుల భవిష్యనిధిలో చందాదారులుగా ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ ను కేంద్ర పెంచబోతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ఈపీఎస్ 95 పెన్షన్ పథకం కింద వీరికి ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస మొత్తం వెయ్యి రూపాయల నుంచి రూ.7500కు పెంచబోతున్నట్లు దీని సారాంశం. దీంతో కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తుందని కూడా ఉద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ అందుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కేంద్రం వీరికి ఇచ్చే మొత్తం సవరించి 7500కు పెంచుతుందని వారు ఆశించారు. కానీ అలాంటి ఆలోచనేదీ లేదని ఇవాళ పార్లమెంట్ లో కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి శోభా కరంద్లాజే తేల్చిచెప్పేశారు. పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ క్లారిటీ ఇచ్చారు.

ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో యజమాని ఇచ్చే 8.33 శాతం వాటాతో ఉద్యోగుల పెన్షన్ నిధికి నిధులు అందుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఏటా దీని ద్వారానే ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ పథకం నిధి లోటులో ఉందని ఆమె తెలిపారు. దీంతో ప్రభుత్వం అదనపు నిధులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. కాబట్టి కనీస పెన్షన్ పెంపు ఆలోచన చేయడం లేదని ఆమె పేర్కొన్నారు.

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు 58 ఏళ్ల వయస్సు వచ్చాక ఈ పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా పొందిన చివరి జీతం ఆధారంగా కనీసం వెయ్యి రూపాయలు, గరిష్టంగా 7500 వేలు పెన్షన్ గా ఇస్తున్నారు. అయితే ఈ కనీస మొత్తాన్ని 7500 చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. కానీ కేంద్రం మాత్రం దీనికి అంగీకరించడం లేదు. లోటు బడ్జెట్ ను కారణంగా చూపి ఈసారి కూడా తప్పించుకుంది.












Click it and Unblock the Notifications