వొడాఫోన్ ఐడియా ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసిన కేంద్రం.. !!
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనాన్ని కల్పించింది. ఈ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ బకాయిలను ప్రస్తుతానికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మారటోరియం మొత్తం విలువ 87,695 కోట్ల రూపాయలుగా తేలింది.
ఈ నిర్ణయం వొడాఫోన్ ఐడియాకు దీర్ఘకాలిక ఆర్థిక భారం నుండి కోలుకోవడానికి తోడ్పడుతుంది. రుణభారంతో సతమతమవుతున్న ఆ టెలికాం ఆపరేటర్‌కు ప్రస్తుతం ఊపిరి పీల్చుకునే అవకాశం లభించింది. తక్షణం బకాయిలు చెల్లించాలనే ఒత్తిడి తొలగిపోయినట్టయింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, వాయిదా పడిన ఈ బకాయిలను 2032 ఆర్థిక సంవత్సరం నుంచి 2041 ఆర్థిక సంవత్సరం వరకు అంటే పది సంవత్సరాల కాలంలో చెల్లించవచ్చు.

ఈ మారటోరియం సమయంలో వాయిదా మొత్తానికి ఎటువంటి వడ్డీ ఉండదు. వడ్డీ రహితంగా ఈ 87, 695 కోట్ల రూపాయల మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా సంస్థ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత మిగిలిన బకాయిలను 6 నుంచి 10 వాయిదాలలో కంపెనీ చెల్లిస్తుంది. వొడాఫోన్ ఐడియాలో 49 శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వమే అతిపెద్ద పబ్లిక్ వాటాదారుగా ఉంది.
ప్రభుత్వ వాటాను రక్షించడం, బకాయిల తిరిగి చెల్లింపును నిర్ధారించడం, దేశ టెలికాం మార్కెట్‌లో పోటీని కాపాడుకోవడం వంటి కారణాల వల్ల వొడాఫోన్ ఐడియా సంస్థకు భారీ ఊరట ఇచ్చిందని, ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం కూడా అదేనని అధికార వర్గాలు తెలిపాయి. దాదాపు 20 కోట్ల వొడాఫోన్ ఐడియా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతగా అభివర్ణించారు. డిసెంబర్ 31 వరకు వాయిదా వేసిన ఏజీఆర్ బకాయిల మొత్తాన్ని టెలికాం విభాగం మళ్లీ సమీక్షించనుంది.
కటాఫ్ వెరిఫికేషన్ మార్గదర్శకాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా ఈ సమీక్ష జరుగుతుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ వాయిదా ప్రక్రియలో ఒక షరతు ఉంది. సుప్రీం కోర్ట్ 2020 ఆదేశాలకు అనుగుణంగా ఖరారైన 2018, 2019 ఆర్థిక సంవత్సరాల ఏజీఆర్ బకాయిలలో మార్పు ఉండదు. వొడాఫోన్ ఐడియా ఈ మొత్తాన్ని 2026 ఆర్థిక సంవత్సరం నుండి 2031 వరకు తప్పనిసరిగా చెల్లించాలి.












Click it and Unblock the Notifications