సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రతిష్టాత్మక ఆదాయపుపన్ను శాఖ అవార్డు: ఎందుకంటే?
చెన్నై: ప్రముఖ సినీనటుడు, సూపర్ స్టార్ రజినీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపుపన్ను చెల్లిస్తున్నందుకు గాను ఆ శాఖ అధికారులు ప్రతిషాత్మక అవార్డును రజినీకాంత్ కు ప్రదానం చేశారు.

రజినీకాంత్ బదులు అవార్డు స్వీకరించిన ఐశ్వర్య
ఆదాయపు పన్ను దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డును బహుకరించారు. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి రజినీకాంత్ హాజరుకాలేదు. ఆయన స్థానంలో పెద్ద కూతురు ఐశ్వర్య ఈ అవార్డును స్వీకరించారు.

మోడీ కృషి వల్లేనంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ముఖ్యఅతిథిగా హాజరైన తమిళసై మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర కృషి వల్లే ప్రజలు పన్నులు కట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలని కోరారు. పన్నులు చెల్లించకపోతే మనం ఉనికిని కోల్పోతామని ఆమె పేర్కొన్నారు. పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో అనేకమంది భాగస్వాములవుతున్నారని చెప్పారు.

ఐటీ విధానాలు సులభతరం చేయాలన్న గవర్నర్ తమిళిసై
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా 2025 వరకు అవతరిస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ, ఆదాయపన్ను శాఖ సంయుక్త కృషితో దేశంలో ప్రస్తుతం పన్ను చెల్లించేవారి సంఖ్య పెరిగిందన్నారు. అంతేగాక, ఐటీ విధానాలు మరింత సులభంగా చేసి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చేయాలని గవర్నర్ ఐటీ శాఖకు సూచించారు. కాగా, తమిళనాడు దేశానికి డైరెక్ట్ టాక్స్ రెవెన్యూ ఇస్తున్న 4వ అతిపెద్ద రాష్ట్రమని ఐటీ అధికారులు ఈ సందర్బంగా తెలిపారు.












Click it and Unblock the Notifications