Hyderabad: విమానానికి బాంబు బెదిరింపు.. 6 గంటలపాటు నిలిచిపోయిన ఫ్లైట్..
ఈ మధ్య విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ పెరిగిపోయాయి. తాజాగా గురువారం అధికారులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో ఇండిగో విమానం హైదరాబాద్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. విమానం దాదాపు 6 గంటల పాటు ఎయిర్ పోర్టులో ఆగాల్సి వచ్చింది. ఓ ఇండిగో విమానం కోయంబత్తూర్ నుంచి చెన్నై వయా హైదరాబాద్ మీదుగా బయల్దేరింది. కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ లో విమానం ల్యాండ్ అయింది. విమానం దిగే వారు దిగిపోయారు. చెన్నై వెళ్లే వారు విమానం ఎక్కారు.
విమానం 181 మంది ప్యాసింజర్లతో టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉండగా విమానాశ్రయ అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని నిలిపివేసి బాంబు స్వ్కాడ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్, ఆర్జీఐఏ పోలీసులు బాంబు స్క్వాడ్ ఆరు గంటలపాటు విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో హైదరాబాద్ నుంచి చెన్నైకి ప్రయాణికులతో సహా బయలుదేరింది.

బెదిరింపు ఈమెయిల్ ఎవరు పంపారు అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా పలు నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. సెప్టెంబర్ 28, 2024న ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్, ఆగ్రాలకు నేరుగా విమానాలను ప్రవేశపెట్టింది.
దేశీయ విమాన ప్రయాణానికి కీలకమైన కేంద్రంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుగుతోంది. అగర్తల, కాన్పూర్, ఆగ్రా, జమ్ము, ప్రయాగ్‌రాజ్, అయోధ్య అనే ఆరు నగరాలకు విమానయాన సంస్థ నేరుగా విమానాలను నడుపుతోంది.












Click it and Unblock the Notifications