వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్: చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్: పోలీసులపై దాడి చేసిన కేసులో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. మే 8 వరకు రిమాండ్ విధించింది. షర్మిలను సోమవారం రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు నాంపల్లి కోర్టులో ఇరు వర్గాల తరపున వాడివేడి వాదనలు జరిగాయి.
సిట్ ఆఫీస్‌కు వెళ్తున్న షర్మిలను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై షర్మిల దురుసుగా ప్రవర్తించిందని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పోలీస్ అధికారులపై చెయ్యి కూడా చేసుకుందని కోర్టుకు వివరించారు. కారుతో పోలీసులను గాయపరిచారని.. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఎస్ షర్మిల ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారని.. ఒక ఎస్సైతో దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కల్గించారని కోర్టుకు వివరించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారని.. ఏ3 పరారీలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు/ప్రభుత్వం తరపు న్యాయవాది.

మరోవైపు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సిట్ చీఫ్‌ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. షర్మిలను ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని.. పోలీసులే షర్మిల పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసులని చెప్పారు. అందుకే రిమాండ్ రిజెక్ట్ చేయాలని బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామని తెలిపారు.
మహిళ అని చూడకుండా పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని కోర్టుకు తెలిపారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తారన్నారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. షర్మిలకు 14 రోజుల రిమాండ్ విధించారు. బెయిల్‌పై రేపు(మంగళవారం) వానదలు వినిపించనున్నారు షర్మిల తరపు న్యాయవాది. మరోవైపు, షర్మిల అరెస్టుపై వైయస్సార్టీపీ శ్రేణులు మండిపడుతున్నారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications