నూతన సచివాలయంలో అప్పటిదాకా అడుగుపెట్టను: బండి సంజయ్ సంచలనం!!
తెలంగాణ రాష్ట్రంలో నూతన సచివాలయ భవనాన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇక ఈ క్రమంలో నూతన సచివాలయం పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయం నిర్మాణం చేపట్టారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కచ్చితంగా తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో మార్పులు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.
సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినా తాను వెళ్లనని బండి సంజయ్ తేల్చిచెప్పారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లో అస్సలు అడుగుపెట్టనని ఆయన చెప్పుకొచ్చారు. సచివాలయం నిర్మాణంలో హిందువుల వాటా రెండు గుంటలు మాత్రమేనా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ఎవరూ హాజరు కావడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పూర్తిగా మార్చిన తర్వాత నే సెక్రటేరియట్ లో కాలు పెడతానని బండి సంజయ్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. తెలంగాణ ఖ్యాతిని నలుదిక్కులా చాటేలా నూతన సెక్రటేరియట్ నిర్మాణం చేశామని, హైదరాబాద్ కీర్తికిరీటంలో తళుక్కుమనే వజ్రంలా ప్రారంభోత్సవానికి తెలంగాణ సెక్రటేరియట్ సిద్ధమైందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
రేపు తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ కి అవకాశం ఎక్కువ ఉండటంతో ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సి పి సుధీర్ బాబు వెల్లడించారు.

ఇక సచివాలయానికి వచ్చి ఆహ్వానితుల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించామని, ఆహ్వానితులు తమ పాస్ లను కార్ గ్లాసులకు అతికించుకోవాలి అని సూచించారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications